Thursday, 5 November 2026

లోక్ అదాలత్ కు అన్ని రకాల ఏర్పాట్లు

 

వరంగల్ బ్యూరో, ఆగస్టు 23 (జనం సాక్షి)

 

వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో వరంగల్ ప్రధాన న్యాయమూర్తి కే.రాధాదేవి మాట్లాడుతూ “గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి, మన వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, తేదీ:09.09.2023 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులో మరియు నర్సంపేట మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్సూమర్ ఫోరమ్ కేసులు, ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు మరియు ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపారు. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్దం కావాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకుని, కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలియజేశారు. రాజీపడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయుటకు గాను వివిధ తేదీలలో న్యాయమూర్తులతో, పోలీసు అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ, ఎక్సైజ్ శాఖ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదుల తోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతో, కోర్టు కానిస్టేబుల్స్ తో వేరు వేరు సమావేశాలు ఏర్పాటు చేసి, అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి, కక్షిదారులకు లోక్ అదాలత్ వలన కలిగే మేలును మీ వంతుగా, మీ శైలిలో తెలుపాలి అని ఈ సందర్భంగా కోరారు. రాజీ పడదగు కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాజీపడదగు పెండింగ్ కేసులను పరిష్కరించుటకు తగినన్ని బెంచీలను ఏర్పాటు చేసి, కక్షిదారుల సమయం వృధా కాకుండా, ఎటువంటి నిరుత్సాహానికి గురికాకుండా, వీలైనంత త్వరలో కేసు పరిష్కరించబడేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో ప్రతీ ఒక్కరు తమవంతుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైననూ, సందేహాలకైననూ, ఏదేని న్యాయసహాయం కు అయిననూ న్యాయసేవాధికార సంస్థ ను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేశారు. లోక్ అదాలత్ పట్ల మరింత సమాచారం కొరకు 9391807362 నంబర్ కు కాల్ చేసి, సందేహాలను నివృత్తి చేసుకోగలరని తెలిపారు.