విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో చోటు చేసుకుంది.బాధితురాలు బోయిళ్ల ఆదమ్మ తెలిపిన వివరాల ప్రకారం తన భర్త చనిపోవడంతో కుమారుడు, కోడలితో కలిసి 29వ వార్డు పరిధిలోని తాళ్లగడ్డలోని తమ నివాసంలో జీవనం సాగిస్తున్నారు.ఆదమ్మ కోడలు ఊరికి వెళ్లడంతో, ఆదమ్మ కొడుకుతో కలిసి తన సొంతూరుకి వెళ్లారు.రాత్రి వేళా ఇంట్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆదమ్మతో పాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.ఇంట్లోని సామాన్లు, తులం బంగారం,12 తులాల వెండి గొలుసులు కాలి బూడిదయ్యాయి.కొడుకు, కోడలు విద్యార్హతల సర్టిఫికెట్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయని ఆదమ్మ కన్నీరు పెట్టుకున్నారు.తాము వచ్చేలోపు ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయిందని బోరున విలపించారు. ఆస్తి నష్టం రూ. 5 లక్షల వరకు జరిగిందని, కట్టుబట్టలతో ఉన్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.