మణుగూరులో రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి
స్కూటీని లారీ ఢీకొనడంతో మహిళ మృతి
యాదాద్రిలో బస్సును ఢీకొన్న లారీ
హైదరాబాద్,ఫిబ్రవరి25( జనం సాక్షి): వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. అలాగే బస్సు,లారీ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘోర ప్రమాదం జరిగిది. ముణుగూరు మండలంలోని సమితిసింగారం వద్ద గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇకపోతే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న నరెడ్ల రజిని (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. టేకుమట్ల మండలంలోని కుందనపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొంది. మోత్కూర్ మండలంలోని అనాజిపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి
తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




