…..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పాను గల్ ఆగస్టు 29 ( జనం సాక్షి)
అన్ని రంగాలలో కన్నా వ్యవసాయం ఎంతో ప్రాధాన్యత కలిగిన వృత్తి అని, సేద్యాన్ని బృహత్ కార్యంగా భావించి ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం పాన్గల్ మండలంలోని రాయినిపల్లి, అన్నారం గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నదని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పొంది లాభసాటి సేద్యాన్ని సాగు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం రైతులకు సాగునీళ్లు, రైతుబంధు, ఉచిత కరంటును అందిస్తున్నదని, రైతులకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా ఎకరాకు సుమారు రూ.70 వేల నుండి లక్ష వరకు ఆదాయం పొందవచ్చునని, అంతేకాక వీటితో పాటు అంతరపంటలు సాగు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చునని రైతులకు ఆయన తెలిపారు. పాన్ గల్ మండలంలోని అన్నారం గ్రామ పంచాయతీలో రూ.1083.70 లక్షలతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ద్యం గల గోదాములను మంత్రి ప్రారంభించారు. అనంతరం రాయినిపల్లె గ్రామంలో రూ.2.92 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాంను మంత్రి ప్రారంభించారు. రైతులు తమ పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఆయా గ్రామాలలో గోదాములను నిర్మించి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని మంత్రి సూచించారు. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు వృద్ధి చెందాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




