వ్యవసాయ రంగాన్ని బలోపేతంపై ప్రత్యేక దృష్టి
నిరంతర విద్యుత్‌తో రైతుల కష్టాలు తొలగించాం
వృద్ధిరేటులో ముందజలో ఉన్నాం
అభివృద్ధి, సంక్షేమం దిశగా వేగంగా అడుగులు
– ఐటీ రంగ అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం
– జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శం
– విద్యా, వైద్యాభివృద్ధికి పెద్దపీట వేశాం
– వచ్చే విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు ఏర్పాటు చేస్తాం
– త్వరలో గ్రామాల్లో ఈఎన్టీ శిబిరాలు
– మార్చి చివరి నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ నీరు
– రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది
– తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయి
– సంక్షేమ పథకాల వల్లే రెండోసారి అధికారం
– ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నర్సింహన్
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్ఆనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రానున్న ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రతి ఎకరాకు నీరుఅందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటులో ముందంజలో ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం నర్సింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉభయసభల మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం పయనిస్తోందని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవినీతికి తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని తెలిపారు. విద్యుత్ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని, పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని అన్నారు. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు. జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం పూర్తిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నామని, 2019 మార్చి నాటికి మిషన్ భగీరథ పథకం పూర్తవుతుందని తెలిపారు. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకమన్నారు. పాలమూరు – రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మిషన్ కాకతీయ ద్వారా సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
సాగుకు నిరంతర విద్యుత్‌తో రైతుల కష్టాలు తొలగాయని, ఒకప్పుడు విద్యుత్ కోసం రాష్ట్రంలో ఉద్ధృతంగా ధర్నాలు జరిగేవని, 42నెలల్లోనే 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో నేడు తెలంగాణ.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, పెరుగుతున్న విద్యుత్ వినియోగం అభివృద్ధి సూచికగా నిలుస్తుందన్నారు. త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబడుతుందన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడా కరెంట్ అందుతోందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం సంతోషదాయకమని, ఈ పథకాన్ని దేశంలోని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారని గుర్తుచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నామని, రైతుబంధు పథకంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రారంభించిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు రైతుబంధు పథకం అమలు చేసేదిశగా ముందుకెళ్తున్నాయన్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందించామని, రైతు సమస్యలపై చర్చల కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నామన్నారు. రైతుబీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్న ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. చిన్నాభిన్నమైన గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని తెలిపారు. ధ్వంసమైన కులవృత్తులు మళ్లీ జీవనం పోసుకుంటున్నాయని అన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వ అవసరాల కోసం చేనేత కార్మికుల నుంచి భారీ ఎత్తున వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, గద్వాలలో కూడా టెక్స్టైల్ హబ్ నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకులాలు ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కోసం వచ్చే బడ్జెట్లో నిధులు మరిన్ని పెంచుతున్నామన్నారు. ప్రజల చెంతకే వైద్య సేవల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, ఉచిత వైద్య పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశామని, త్వరలోనే సూర్యాపేటలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టిసారించిందని గవర్నర్ తెలిపారు. ప్రసూతి, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, కేసీఆర్ కిట్‌లో శిశువు, తల్లి కోసం రూ. 2 వేల విలువ చేసే 16రకాల వస్తువులు ఇస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు శిబిరాల్లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని, ఈ పథకం కింద ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలోనే ఈఎన్టీ శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల కలలు సాకారం చేయటం జరిగిందని తెలిపారు. పరిపాలన, శాంతిభద్రతల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ప్రభుత్వ పాదర్శకత వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే కొత్తగా 4వేల పరిశ్రమలకు అనుతులు ఇచ్చామని, ప్రపంప ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చాయని గవర్నర్ గుర్తుచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని, స్థలం ఉండి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేయటం జరుగుతుందని అన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని, స్థానికులకే ఉద్యోగాలు
దక్కేలా జోన్ల సంఖ్య, రిజర్వేషన్లు పెంచటం జరిగిందని అన్నారు. ఆసరా పెన్షన్లు పెంచబోతున్నామని, ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునాదిగా చేసుకొని తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపి వారికి ఆనందం, సంపద కలిగేలా బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా నా ప్రభుత్వం పునరంకితం అవుతుందని ధృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అని గవర్నర్ నరసింహన్ తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఐకేపీ మహిళలకు అప్పగించనున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం పునరంకితం అవుతుందని గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయసభలు వాయిదా పడ్డాయి.




