Monday, 2 November 2026

సభను హరీశ్‌ తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు

 

 

– ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి)

మంత్రి హరీశ్‌ రావు సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ చర్చకు అనుమతి ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ వాకౌట్‌ చేశామన్నారు. ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ ద్వారా ఎంతోమంది పేదవారు ఉన్నత చదువులు చదువుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చిందంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ బకాయీలు చెల్లిస్తామని చెప్పి ఆ హావిూని నెరవేర్చలేకపోయిందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందంటూ కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల జీవితాలతో సర్కార్‌ ఆటలాడుకుంటోందన్నారు. ప్రభుత్వ పెద్దలే కళాశాలలు పెట్టి విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఈ పథకం అమలు చేసేలా చూస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాంమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ చెల్లించకుండా కళాశాలలు మూసివేయాలని కుట్రపన్నుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పథకాన్ని అమలు చేస్తే మాకెలాంటి ఉపయోగం ఉండదనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.