నాలుగేళ్లలో అద్భుతమైన ప్రగతి
సిఎం కెసిఆర్ ఆదేశాలతో పక్కా ప్రణాళిక
హైదరాబాద్,జనం సాక్షి): తెలంగాణ ఆవిర్భావంత తరవాత సిరుల బంగారం సింగరేణి ఈ మూడేళ్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. అంతర్జాతీయంగా ఎదగాలన్న సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దడంలో గతంలో పనిచేసిన సిఎండిలతో పాటు ప్రస్తుత సిఎండి శ్రీధర్ విశేషంగా కృషి చేస్తున్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత సరికొత్త మైలు రాళ్లను అధిగమించింది. సింగరేణి బొగ్గు ఉత్పాదన పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా తీర్చి దిద్దాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. దీంతో ఉత్పత్తి పెరిగింది. కార్మాక సంక్షేమానికి భరోసా దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదల శాతం కేవలం రెండు శాతం మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏర్పాటైన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్పత్తి పెరుగుదల శాతం ఐదు నుంచి 15 శాతానికి పెరిగింది. ఉత్పత్తితో పాటు బొగ్గు రవాణాలో సైతం రికార్డులను అధిగమించింది. 16 ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనులు, 30 భూగర్భ గనులు దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 9.5 శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో సింగరేణి బొగ్గు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు ప్రధాన ముడిఖనిజంగా అందిస్తూ విద్యుత్ వెలుగులను పంచుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పాదన పరిశ్రమ తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా రూపాంతరం చెందుతోంది. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద ఏకైక బొగ్గు ఉత్పాదన పరిశ్రమగా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు వికసింపజేస్తున్నది. సింగరేణి సంస్థలో గడిచిన మూడేళ్లలో రెండు భూగర్భగనులు, రెండు ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనులు ప్రారంభమయ్యాయి. కొండాపురం, ఖాసీపేట 2 ఇంక్లెన్ భూగర్భగనులను కొత్తగా ప్రారంభించారు. మణుగూరు, బెల్లంపల్లిలో రెండు ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనులు ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కొత్త బొగ్గుగనులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 22 బొగ్గుగనులను చేపట్టాలని నిర్ణయించారు. కొత్తగూడెం సవిూపంలోని పెనగడపలో మరో బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఊహించని రీతిలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశ చరిత్రలోనే ఉత్పత్తిలో సరికొత్త రికార్డును సృష్టించింది. కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ లేని కార్యక్రమాలను ఈ మూడేళ్లలో అమలు చేశారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం బొగ్గు ఉత్పత్తికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన సింగరేణి సంస్థ రాష్ట్రం ఏర్పాటైన తరువాత బొగ్గు నాణ్యతను పెంచు కోవడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అధిక ఉత్పత్తిని సాధించడమే కాకుండా నాణ్యమైన బొగ్గును అందించడం ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును రవాణా చేస్తోంది. ఒడిషా లోని నైనీ కోల్‌బ్లాక్‌లో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి ప్రాథమిక కార్యాచరణను ప్రారంభించింది. బొగ్గు నాణ్యతను పెంచేందుకు బొగ్గుశుద్ధి కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో నెలకొల్పేందుకు సింగరేణి కార్యాచరణ చేపట్టింది. ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనుల ప్రాంతాల్లో ఓవర్బర్డెన్పై పెద్ద ఎత్తున మొక్కలను పెంచడం ద్వారా, భూగర్భ గనుల్లో సైతం పర్యావరణ హిత చర్యల ద్వారా సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సింగరేణిలో ఇప్పటి వరకు ఎలాంటి సమ్మెలు జరగలేదు. గత ప్రభుత్వాల హయాంలో సింగరేణిలో చీటికిమాటికి సమ్మెలు జరిగేవి. దీని వల్ల ఉత్పత్తి పాటు కార్మికులు వేతనాలను నష్టపో యేవారు. సమ్మెల సంస్కృతి వల్ల సింగరేణి సంస్థ ఆర్థికంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొనేది. అలాంటి పరిస్థితి నుంచి సింగరేణి బయట పడింది. కార్మికుల్లో సంస్థను కాపాడుకోవాలని, ప్రగతిని సాధించి బంగారు తెలంగాణలో సింగరేణిని భాగస్వామిని చేయాలనే పట్టుదల పెరిగింది. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అండగా శ్రీరాంపూర్థర్మల్ పవర్ ప్రాజెక్టు సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా విద్యుత్ ఉత్పాదనా రంగంలోకి అడుగుపెట్టి 2016లో సరికొత్త అద్యాయానికి నాంది పలికింది. విద్యుత్ ఉత్పాదన రంగంలో ప్రవేశించడం ద్వారా సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవస రాలను తీరుస్తూ కొండంత అండగా నిలుస్తోంది.




