Thursday, 5 November 2026

అంతుచిక్కని రాజాసింగ్‌ అంతరంగం

అనూహ్యంగా బిజెపికి రాజీనామాపై నేతల మల్లగుల్లాలు

బిజెపితో తెగదెంపులకు కారణాలపై అనుమానాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ):  బిజెపికి రాజీనామా చేసిన గోషామహాల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ వ్యూహంపై రాజకీయ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా గతకొంత కాలంగా బిజెపి నాయకత్వంతో విభేదిస్తూ వచ్చిన రాజాసింగ్‌ బీజేపీకి రాజీనామా చేయడంపై ఆపార్టీకి మింగుడు పడడం లేదు. తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న దశలో ఆయన రాజీనామా పార్టీకి ఓ షాక్‌లాంటిదని భావిస్తున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ తరపున పోటీలో నిలబడతారని ప్రచారం జరుగుతున్న సందర్భంలో రాజీనామా అంశం చర్చనీయాంశమైంది. గోవధను వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తానని అంటున్న రాజీసింగ్‌ రాజీనామా చేయడం స్థినకంగా కలకలం రేపుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజాసింగ్‌ తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గోషామహాల్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి ముఖేష్‌తో తలపడి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలోని రాష్ట్ర స్థాయి నేతలతో ఆయనకు పేచీ మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డిపై వివిధ సందర్భాల్లో రాజాసింగ్‌ నేరుగానే ఆరోపణలు చేశారు. కిషన్‌ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే డాక్టర్‌ కే.లక్ష్మణ్‌ పార్టీ అధ్యక్షుడు కావడంతో ఆయనతో కొంత సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఆయన కొంతకాలం దూరంగా ఉన్నారు. ఇటీవల నగరానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజాసింగ్‌తో ఏకాంతంగా సమావేశమైనట్లు తెలిసింది. అప్పటి నుంచీ రాజాసింగ్‌ హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా కొనసాగింది. దీన్ని ధ్రువీకరిస్తూనే రాజాసింగ్‌ కూడా మాట్లాడేవారు. ముస్లింలకు ఇఫ్తార్‌ విందులు, బహుమతులు ఇస్తూ వారికి దగ్గరగా ఉండే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ ఎంపీ సీటుకు పోటీ చేయడం సముచితమని అన్నారు. తనలాంటి వారికి అది పొసగదని తేల్చిచెప్పారు. అమిత్‌షాతో బేటీ తర్వాత అంతా సర్దుకుందని పార్టీ నేతలు భావిస్తున్న సమయంలో పార్టీని వీడుతున్నానని అనూహ్యంగా రాజాసింగ్‌ బాంబ్‌ పేల్చడం బీజేపీ నేతలను కొంత ఆందోళనకు గురిచేసింది. రాజీనామా పత్రాన్ని మూడు రోజుల ముందే రాష్ట్ర అధ్యక్షుడికి అందచేశానని ఆదివారం విూడియాకు వివరాలు వెల్లడించారు. తాను హైందవ ధర్మానికి కట్టుబడి గోవధను వ్యతిరేకిస్తున్నానని, అక్రమ పశు వధ కేంద్రాలను తీసేయాలని అసెంబ్లీలో, బయట తాను చేస్తున్న పోరాటానికి పార్టీ ఎప్పుడూ సహకరించలేదేని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గోమాతను రక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తన వల్ల పార్టీకి ఇబ్బంది ఉండకూడదనే భావనతో రాజీనామా చేస్తున్నట్లు రాజాసింగ్‌ పేర్కొన్నారు. ఉత్తరాదివారు ఎక్కువగా ఉన్న గోషామహాల్‌లో బీజేపీకి మంచి పట్టు ఉంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజాసింగ్‌ పార్టీని వీడటం స్థానికంగా అలజడి రేపుతోంది. అయితే ఆయన టిఆర్‌ఎస్‌లో చేరుతారా లేక ఒంటరి

పోరాటం చేస్తారా అన్నది తెలియడం లేదు.