పర్యాటక కేంద్రంగా మారనున్న ఐమాక్స్ ప్రాంతం
హైదరాబాద్,జూలై13(జనం సాక్షి): ప్రభుత్వం తలపెట్టిన భారీ అండేడ్క్ విగ్రహాన్ని ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న డాక్టర్ కార్ స్థలాన్ని కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇప్పటికే ఖాళీ చేయించి హెచ్‌ఎండీఏ తన అధీనంలోకి తీసుకుంది. ప్రభుత్వం ఎన్టీఆర్‌గార్డెన్ పార్టీ జోన్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ స్థలం అటు ఐమ్యాక్ థియేటర్, ఇటు ఎన్టీఆర్ గార్డెన్, మరో పక్కన ఇందిరాగాంధీ సర్కిల్‌కు ఆనుకొని ఉంది. హుస్సేన్‌సాగర్‌తీరంలో ఈవెంట్లకు ఈ స్థలాన్ని తాత్కాలిక పద్దతిన కిరాయికి ఇవ్వనున్నారు. నెక్లెస్ రోడ్డులో పీపుల్స్ ప్లాజా మాదిరిగా మరో కొత్త స్థలాన్ని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సిద్ధం చేసింది. ఇప్పటివరకు డాక్టర్ కార్స్ ఉన్న సుమారు మూడెకరాల స్థలాన్ని రోజువారీ ఈవెంట్లు నిర్వహించు కునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ స్థలాన్ని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌గా పిలుస్తూ అద్దెకు ఇవ్వనున్నారు. ఈవెంట్ల నిర్వహణతో ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో రోజు వారీగా అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. సుమారు మూడెకరాల స్థలాన్ని డాక్టర్ కార్ సంస్థ 2006లో లీజుకు తీసుకొంది. గడువు ముగిసినా ఖాళీ చేయకుండా కోర్టుకు వెళ్లడంతో 2011లో నుంచి వివాదం తలెత్తింది. అప్పటి నుంచి స్థలాన్ని ఖాళీ చేయించే విషయమై కోర్టులో వాదనలు జరిగాయి. చివరకు కోర్టు తీర్పు హెచ్‌ఎండీఏకు అనుకూలంగా రావడంతో స్థలాన్ని ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలాన్ని ఎక్కువ కాలం ఎవరికీ లీజుకు ఇవ్వకుండా రోజువారీగా తాత్కాలికంగా అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల భవిష్యత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని పార్టీజోన్‌లో కాకుండా ఇక్కడే ఏర్పాటు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవన్న ఉద్దేశంతో స్థలాన్ని ఖాళీగానే ఉంచనున్నారు. ప్రస్తుతం పీపుల్స్ ప్లాజాకు రోజుకు లక్ష రూపాయల అద్దెను వసూలు చేస్తున్నట్టుగానే ఈ స్థలానికి అదే రేటు నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఐమ్యాక్స్, ఎన్టీఆర్‌గార్డెన్ పక్కనే ఉండడంతో ఈవెంట్లకు ఈ స్థలం అనువుగా ఉంటుందని, పార్కింగ్‌కు సైతం ఇబ్బంది ఉండదని చెప్పారు.




