Wednesday, 4 November 2026

అడవుల నరకివేతతో విపరీత పరిణామాలు

వాతావరణ కాలుష్యానికి ప్రజలదే బాధ్యత

మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత కావాలి

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): వాయుకాలుష్య పీడను విరగడ చేసి ఆరోగ్యకర సమాజాన్నిఅవతరింపజేసే లక్ష్యంతో మొక్కల పెంపకం బృహత్తర సామాజికోద్యమం స్థాయికి ఎదగాల్సి ఉంది. తీవ్ర వర్షాభావం,వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురువుతున్న తరుణంలో ఇనుమడించిన పట్టుదలతో పచ్చదనం పెంపొందించడానికి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉద్యుక్తం కావాలి. అడవుల నరికివేత కారణంగా ఇప్పుడు ఎడారులు తయారయ్యాయి. వర్షాలు వెనక్కి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. మళ్లీ వర్షాకాలం వానల కోసం ఇప్పటి నుంచే ఎదరుచూడాల్సిన ఆగత్యానికి ప్రజలదే బాధ్యత. అలాగే ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వల్లనే ఇలాంటి వాతావరణం తయారుయ్యిందనడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఆహ్లాదభరిత హరితావరణ శోభలు వెల్లివిరియడానికి వృక్షసంపదే మూలాధారం. అదే మనకు జీవితాధారం. చెట్టు ఉంటేనే వర్షాలు ఉంటాయి. పుడమి పులకరిస్తుంది. వర్షాలు సకాలంలో పడతాయి. ఆ స్ఫూర్తికి ప్రభుత్వాలు పట్టం కట్టాలి. సక్రమంగా వానలు కురిపించి, ప్రగతికి మెట్లుగా ఉపకరించే చెట్లను పెంచడంలో చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్వాలి. వాతావరణాన్ని చల్లబరచడంలో, భూక్షయాన్ని నివారించడంలో చెట్ల పాత్ర, ప్రాముఖ్యం ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలి. ఒక్కో చెట్టూ ఏటా పాతిక కిలోల సారవంతమైన నేల గాలివానకు కొట్టుకుపోకుండా అడ్డుకొంటుంది. భారీవృక్షం రోజుకు 400 లీటర్ల వరకు నీటిని ఆవిరిగా మార్చి వర్షపాతాన్ని స్వాగతిస్తుం టుంది. అందుకే చెట్టూ చేమా ఉంటేనే పర్యావరణ సమతూకానికి, ప్రకృతిలో పచ్చదనానికి

భరోసా ఏర్పడుతుంది. దురదృష్టవశాత్తు దేశంలో అనుదినం 20వేల హెక్టార్ల మేర అడవులు నాశనమై, వాతావరణ కాలుష్యం పెచ్చరిల్లుతోంది. పర్యవసానంగా దేశంలో రోజూ లక్షమంది వరకు నిస్సహాయంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పచ్చదనం-పరిశుభ్రం అన్నది రెండూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు అమలు చేయాల్సిన కార్యక్రమాలు. ప్రభుత్వాలు ఈ రెండింటిని కఠనంగా అమలు చేస్తూ ప్రజలను భాగస్వాములను చేయాలి. అలా చేయకపోవడం వల్లనే ఇవాళ వాతావారణ పరంగా విపరీత పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఎపిలో ‘వనం-మనం’, తెలంగాణలో ‘హరితహారం’ వెనక సామాజిక ఉద్యమ స్ఫూర్తి వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్‌ వైశాల్యంలో 23 శాతానికి పరిమితమైన అటవీ విస్తీర్ణాన్ని 2024 నాటికి 50 శాతమయ్యేలా ప్రతి పౌరుడూ ముందుకు వస్తే ఏటా అయిదు నుంచి పది మొక్కలు నాటితే హరితాంధప్రదేశ్‌ అవతరిస్తుందన్నది ‘వనం-మనం’ ఉద్యమ నినాదం. మూడేళ్లలో 230 కోట్ల మొక్కల పథకం అమలును ఉరకలెత్తించి తెలంగాణకు పచ్చలహారం అమర్చాలన్నది ‘హరితహారం’ లక్ష్యంగా కెసిఆర్‌ సంకల్పించారు. రెండు తెలుగు రాష్టాల్లోన్రూ మొక్కల పరిరక్షణకు సంబంధించి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమనడంలో సందేహం లేదు. అధికార యంత్రాంగం బాధ్యతగా పనిచేసేలా ప్రజాప్రతినిధులూ తమవంతు క్రియాశీల పాత్ర పోషించినప్పుడే సంకల్పం నెరవేరుతుంది. అలాగే ప్రజలు కూడా తమవంతు విధి నిర్వహించి మొక్కలను సంరక్షించుకుంటేనే మొక్కలు పెరిగి పెద్దవై హరితహారం లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణవ్యాప్తంగా హరితహారంలో మొక్కలు నాటేందుకు విద్యార్థులు, సామాన్య పౌరులు, అధికారులు, అమాత్యులు, యావత్‌ ప్రజా ప్రతినిధులు కూడి రావాలని కేసీఆర్‌ ప్రభుత్వం పిలుపిచ్చింది. అప్పట్లో ఖాళీ స్థలాలు, పోరంబోకు భూముల్లో నాటిన మొక్కల్లో ఇంచుమించు సగమే బతికినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడచిన మూడేళ్లలో మండలానికి 20వేల మొక్కల చొప్పున ఆంధ్రప్రదేశ్‌లో రూ.360 కోట్ల వ్యయంతో నాటిన 30 కోట్ల రాశిలో 60 శాతం మేర ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈసారి నాటుతున్న మొక్కల రక్షణ కోసం తప్పనిసరిగా జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూటిగా తెలియజెబుతున్నాయి. నాటిన మొక్కల్ని సజావుగా సంరక్షించేందుకు తీసుకోవాల్సిన

చర్యలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. మొక్కల పరిరక్షణలో ఉద్యమించినవారిని ప్రోత్సహిస్తూనే, చెట్ల నరికివేతకు బాధ్యులైనవారిని కఠినంగా దండించడం లాంటి చర్యలను సమంగా చేపట్టాలి. మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా తప్పనిసరి చేయాలి. మరుగుదొడ్డి ఉంటేనే గుర్తింపు అన్న విధంగా చేస్తే తప్ప ప్రజల్లో మార్పు రాదు. అలాగే మొక్కలను పెంచడం, వాటిని కాపాడడం, చెట్లను నరకకుండా చేయడం వంటివి సమాజా బాధ్యతగా గుర్తించాలి. అయితే గుడ్డిలో మెల్ల చందంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ హరిత సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. గతంలో నాటిన మొక్కలు ఎండుతున్నా తమపని కాదన్న రీతిలో ప్రజలు చోద్యం చూస్తున్నారు. కనీసం ఓ చెంబెడు నీళ్లు పోసి కాపాడుదామన్న ధ్యాస వారిలో కనిపించకపోవడం వల్లనే ఈ పథకాలు విజయవంతం కావడం లేదు. గతేడాది ఇరవై అయిదు రోజుల వ్యవధిలో మొత్తం 26 కోట్ల మొక్కలు నాటే కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు అడుగులు వేసింది. మూడోవిడత ‘హరితహారం’లో భాగంగా తెలంగాణ అంతటా కేసీఆర్‌ ప్రభుత్వం సుమారు 30 కోట్ల మొక్కలు నాటించింది. తెలుగు రాష్ట్రాలు నిర్ణీత కాలావధిలో కోట్లాది మొక్కలు నాటి సుస్థిరాభివృద్ధికి చెట్టునే చిరునామాగా మారుస్తామంటున్నాయి. ఇదేదో ప్రభుత్వాల మూస పథకాల్లా కాకుండా ప్రజలను బాధ్యలును చేసి సాగితే తప్ప విజయం సాధించలేం. కఠిన చట్టాలు అమలు చేయాలి.

నాటిన మొక్కల్ని కంటికి రెప్పలా కాపాడుకునే జవాబుదారీతనం తీసుకుని రావాలి. విచ్చలవిడిగా చెట్ల నరికివేతను నిరోధించేలా చర్యలు తీసుకోవాలి. ఊరూరా ఉద్యమస్ఫూర్తి వెల్లివిరియజేసేలా మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం ఆగేలా, నిరంతరం మొక్కలకు నీరు పోసి కాపాడేలా చేయగలిగితేనే భవిష్యత్‌ తరాలు జీవించగలుగుతాయి.

————————-