Wednesday, 4 November 2026

హరితహారంలో సీడ్‌ బాంబింగ్‌ ప్రక్రియ

లక్ష్యసాధనకు అటవీశాఖ కసరత్తు

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో దట్టంగా మొక్కలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతేడాది మొదటి సారిగా సీడ్‌ బాంబింగ్‌ పద్ధతిని అవలంబించనుంది. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. అనేక జిల్లాల్లో ఇప్పటికే దీని తయారీ జరిగింది. కొన్నిచోట్ల వీటి ప్రయోగం కూడా సాగింది. తక్కువ ఖర్చుతో మొక్కలు పెంచేందుకు ఈ పద్ధతిని ఇప్పటికే థాయ్‌లాండ్‌ దేశంలో అనుసరిస్తున్నారు. మన దేశంలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గతేడాది సీడ్‌ బాంబింగ్‌ ద్వారా సత్ఫలితాలు సాధించారు. హైదరాబాద్‌ ఫారెస్టు అకాడవిూకి చెందిన నిపుణులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ సంపదను కాపడడంతో పాటు అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. వినూత్న పద్ధతులు, విభిన్న ఆలోచనలతో అటవీ సంపదను పెంపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అడవులు అంతరిస్తుండడంతో మానవాళి మనుగడప్రశ్నార్థకంగా మారుతున్న నేటి తరుణంలో అటవీ సంపదను అభివృద్ధి చేయడానికి ఆశాఖ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇప్పటికే వనరక్షణ సమితులు, నర్సరీల్లో మొక్కలు పెంచడం తదితర కార్యక్రమాల ద్వారా అటవీ సంపదను పరిరక్షణకు కృషిచేస్తున్న ఆశాఖ అధికారులు.. అడవులను మరింత విస్తరించేందుకు విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా విత్తన బంతుల ద్వారా అడవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. అక్కడ విజయవంతం అయింది. దీంతో రాష్ట్రంలో స్పీడ్‌బాల్‌ పద్ధతికి శ్రీకారం చుట్టారు. సీడ్‌బాల్‌ను తయారు చేయడానికి జీవామృతం తప్పని సరి అవసరం. దీనికి కావాల్సిన పదార్థాలు ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, ఏదైనా పప్పుపిండి, నీటిలో బాగా కలపాలి. అప్పుడే అనుకున్న జీవామృతం తయారవుతుంది. దీనిని సీడ్‌బాల్‌లో కలిపితే విత్తనాలు మొలకెత్తి చెట్లుగా తయారవుతాయి. సీడ్‌బాల్‌ను తయారీ చేయాలంటే మూడు రకాల వస్తువులు అవసరం. ఇందులో జల్లెడ పట్టిన ఎర్రమట్టి 70 శాతం, ఏవైనా ఎరువులు 30 శాతం, జీవామృతం, వివిధ రకాల విత్తనాలు అందులో వేసి మంచిగా కలిపి వాటిని బంతి ఆకారంలో రూపొందించి ఎనిమిది రోజులు ఎండబెట్టాలి. తొలకరి వర్షాలు కురియగానే ఆ బంతులను అటవీ ప్రాంతంలో విసిరి వేస్తారు. విత్తనాలు నాటడానికి అనువుగా లేని ఎత్తైన ప్రదేశాలు, బండరాళ్లు తదితర ప్రదేశాల్లో ఈ సీడ్‌బాల్‌ను విసురుతారు. వర్షాలు ఆ బంతులపై పడగానే మట్టి కరిగిపోయి అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా బయటకు వస్తుంది. ఈ మొక్కలు క్రమంగా చెట్లుగా రూపాంతరం చెందుతాయి. ఈ క్రమంలో అడవుల్లో ఏపుగా పెరిగే నెమలినార, కానుగ, రావి, మర్రి, మారేడు విత్తనాలను ఈ బంతుల ద్వారా విసిరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడవులతోనే జీవజాతులకు మనగడ అని తెలంగాణ ఫారెస్టు అకాడవిూ డిప్యూటీ డైరెక్టర్‌ మద్దిరెడ్డి అన్నారు. అడవులు అంతరించి పోవడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని సకాలంలో వర్షాలు కురియక, వేసవిలో ఎండ ల తీవ్రత ఎక్కువ అవుతోందని తెలిపారు. అడవులను రక్షించడంతో పాటు ఉన్న అడవులను పెంచేందుకే సీడ్‌బాల్‌ తయారీపై ఫారెస్టు అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమలు అవుతోందని, రాష్ట్రంలో కూడా సీడ్‌బాల్‌ తయారు చేసి వర్షాకాలంలో వినూత్న ప్రయోగం చేస్తున్నామని తెలిపారు. అడవులు అంతరించి పోకుండా కాపాడుకునేందుకు ప్రతి అధికారి విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అక్రమంగా కలప తరలించే వాహనాలు పట్టుకొని కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని సూచించారు.