Friday, 6 November 2026

అన్నదాతను గట్టెక్కించే ప్రయత్నాల్లో రైతుబంధు ఒకటి

అనేక కార్యక్రమాల ద్వారా రైతుకు భరోసా కల్పిస్తున్న సిఎం కెసిఆర్‌
కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పూర్తయితే మారనున్న వ్యవసాయ ముఖచిత్రం
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధుతో అన్నదాతల్లో ఆనందం
గుత్తా సుఖేందర్‌ రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌,మే15(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరే ఇందుకు నిదర్శనమని రైతు సమన్వయ సమిత రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఒక్కో పథకాన్ని తీసుకుని విశ్లేషిస్తే అర్థం అవుతుందని, విమర్శించాలకునే వారికి దేనినైనా విమర్శించవచ్చాన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతుబందు కార్యక్రమం అమలు జరగడం ఒక ఎత్తయితే, చెక్కులు తీసుకున్న రైతులు ఎంతగా ఆనందంగా ఉన్నారో గ్రామాల్లోకి వెళితే తెలుస్తుందని అన్నారు. మంగళవారం నాడాయన ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో మాట్లాడుతూ రైతుబంధ అన్నది అన్నదాతను గట్టెక్కించే కార్యక్రమాల్లో ఒకటి మాత్రమేనని అన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని, ఆ పరంపరలో ఇది మరోటని అన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పూర్తియతే  సిఎం కెసిఆర్‌ సంకల్పించిన కోటి ఎకరాల మాగాణం కల సాకారం కానుందన్నారు. అప్పుడు రైతులకు నిరంతర నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. నీరు, విద్యుత్‌, వ్యవసాయ పరికరాలు, పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు జరిగి మద్దతు ధరలు లభిస్తే ఇక రైతు రాజు కాక మరేంటని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా అమలు కావడం ఇష్టం లేని వారు మాత్రమే
విమర్శలు చేస్తున్నారన గుత్తా అన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమం అన్నది ఓ సఫల ప్రయత్నమని రుజువు కాబోతున్నదని, దేశానికి ఇది ఆదర్శం కానుందన్నారు. రైతులు పంటల సాగు కోసం ఇప్పటి నుంచి అప్పులు చేయాల్సిన పనిలేకుండా చేయాలన్న ఆలోచనలోంచి వచ్చిందే రైతుబందు పథకమని అన్నారు. తెలంగాణలో కోటీ 42 వేల ఎకరాల వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. పంటలు సాగుచేసే రైతులకు ఎకరాకు రెండు పంటలకు గానూ రూ.8 వేలను అందజేస్తున్న పథకం ఎక్కడయినా ఉందా అని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత పెట్టుబడులతో వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే అవకాశం లభించిందన్నారు. దేశంలో రైతుల బాధలను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, రైతులకు అవసరమైన పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల బోర్‌ వెల్స్‌ ద్వారా 50 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని  తెలిపారు. తెలంగాణలో త్వరలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని, అప్పుడు రెండు పంటలకు పుష్కలంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. రైతులకు వచ్చే నెల నుంచి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని, ఇందుకు అవసరమైన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వేను విజయవంతంగా పూర్తి చేసి పక్కాగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. భూ సమగ్ర సర్వేను అధి కారులు సమర్థవంతంగా నిర్వహించారన్నారు. రైతుల పూర్తి వివరాలతో పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు రైతుల గురించి పట్టించు కోలేదన్నారు.గ్రామాల్లో పంటల సాగులో రైతు సమన్వయ సమితుల సభ్యులు కీలకపాత్ర పోషించాలని కోరారు. సభ్యులు గ్రామాల్లో అధికారులు, రైతులతో సమావేశాలు నిర్వహించి ఏ పంటలు సాగుచేస్తే మంచి ధరలు లభిస్తాయనే విషయాలను చర్చించాలని సూచించారు. గ్రామాల్లో రైతు సమన్వయ సమితుల ద్వారా పంటలను కొనుగోలు చేస్తామని తెలిపారు. వ్యవసాయ క్లస్టర్లో భూసార పరీక్షలు నిర్వహిస్తారని, రైతులు వీటి ఆధారంగా పంటలను వేయాలని సూచించారు.