ఒకేపంటతో నష్టాలు ఎక్కువ
ఆదిలాబాద్,జూన్14(జనం సాక్షి): జిల్లాలో చిరుజఅల్లులతో పాటు గట్టి వర్షాలు పడడంతో ఏరువాక నడుస్తోంది. రైతులు విత్తనాలు చల్లే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఒకేపంట కాకాఉండా రకరకాల పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మిర్చికి గత యేడు సరియైన ధర లభించకపోవడం వల్ల రైతులు పత్తి పంటపై ఆశతో ఉన్నట్లు చెప్పారు. రైతుల అలోచన సరి కాదని చెబుతున్నారు. అన్ని రకాల పంటలను సమాన స్థాయిలో వేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకే పంటను నమ్ముకొవద్దని గత అనుభవాలను రైతులకు గుర్తు చేస్తున్నారు. అందరూ పత్తినే వేస్తే మిర్చి వేసే వాళ్లు తక్కువగా ఉండి మళ్లీ మిర్చికి ధర ఉండొచ్చు. అన్ని విధాలా రైతు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో పేరొందిన పత్తి విత్తన గింజలను కొనుగోలు చేసి రైతులు వాటిని విత్తుకుంటున్నారు. చిరుజల్లులు కురవగా రైతులు విత్తనాలు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ ఆధారిత గ్రామాలు, గిరిజన తండాలు జిల్లాలోఅధికంగా ఉండడంతో మృగశిర కార్తె దాటక ముందే విత్తనం వేస్తున్నారు. గతేడాది తగిలిన మిర్చి ఘాటుకు కోలుకోలేని రైతన్నలు ఈ ఏడాది పత్తి పంట వైపు దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది. తనకున్న భూమిలో ఎక్కువ భూమిని పత్తి పంట కోసం వినియోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భూములు కూడా పత్తి సేద్యానికి రైతులు అనుకూలంగా ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అంచనేసింది. ఈ లెక్కన విత్తన కొరత లేకుండా ఉండేందుకు జిల్లాకు పత్తి విత్తన ప్యాకెట్లను సిద్ధం చేసి జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ కలిగి ఉన్న విత్తన డీలర్ల వద్ద అమ్మకాల కోసం సిద్దంగా ఉంచారు. ప్రభుత్వం విత్తన చట్టాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్న నకిలీ విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతూనే ఉన్నాయి. అధికారులు, పోలీసులు నిత్యం రాత్రింబవళ్లు దాడులు కొనసాగిస్తున్న నకిలీ విత్తన దందా ఆగట్లేదు. బ్రాండెడ్ ప్యాకెట్లను పోలి నకిలి విత్తన ప్యాకెట్లు ఉండడంతో అమాయక గిరిజన రైతులు తెలిసీ తెలియక కొనుగోలు చేసి మోసపోతున్నట్లు తెలుస్తుంది.




