Monday, 2 November 2026

అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి 

– దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలు
– రైతుబంధు, రైతు బీమాతో అన్నదాతల్లో ఆనందం
– మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
– నిర్మల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి
నిర్మల్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నోఅభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు అహర్నిషలు కృషి చేస్తున్నారని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో శనివారం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జాతీయ జెండాను.. ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అత్యుత్తమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో దూసూకుపోతుందని తెలిపారు. ఉద్యమ సారధియే తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టమని, అదే పోరాట స్పూర్తితో బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్‌ అవిరామ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతుబంధు పథకం,ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పేద విద్యార్థులకు రెసిడెన్సియల్‌ స్కూళ్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థ, కేసీఆర్‌ కిట్స్‌, రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ తో పాటు అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి సబ్బండ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కొత్తగా ఏర్పడ్డ నిర్మల్‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనిస్తుందని తెలిపారు. నిర్మల్‌ జిల్లాను అభివృద్దిలో అగ్ర భాగంలో నిలిపేందుకు జిల్లా ప్రజల సహాకారంతో అహర్నిషలు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.ప్రశాంతి, జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు, మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణెళిష్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రామ్‌ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు. అంతకు ముందు అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

————————–