ఆదిలాబాద్,జూన్19(జనం సాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతుంటే, ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మాజీ ఎంపి,ప్రభుత్వ అధికార ప్రతినిధివేణుగోపాలాచారి మండిపడ్డారు. తెలంగాణని కోటి ఎకరాల మాగాణిగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తుంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దగాకోరు చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేని గ్రామాలను, రోడ్డు లేని పల్లెలను, మంచినీళ్లలేని గ్రామాలను బహుమానంగా ఇచ్చిందన్నారు. మూడేళ్ల పసిగుడ్డులాంటి తెలంగాణాపై మాటల దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణాలో అమలవుతుంటే దీనిని తట్టుకోలేని ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీది దగాకోరు విధానమని అన్నారు. ఎన్ని గావుకేకలు పెట్టినా తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. నా తలెంగాణ కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలన్న వారి కుట్రలు కోర్టుల్లో కూడా నిలవడం లేదన్నారు. కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయన్నారు. కేసుల ద్వారా నాలుగు రోజులు ఆలస్యం కావొచ్చేమోకాని ప్రాజెక్టులను ఆపడం కాంగ్రెస్ వల్ల కాదన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా కోటి ఎకరాల మాగాణి అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.




