అమిత్ షా ప్రసంగంలో ఆధార రహిత ఆరోపణలు

సీఎం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం లేదు
సీఎం కేసీఆర్ చెప్పిందే నిజం
మోటర్లకు మీటర్లు పెట్టడమే తరువాయి
మునుగోడు ప్రజలకు నిరాశ మిగిల్చిన షా మాటలు
మునుగోడు ప్రజలు చైతన్యవంతులు
బిజెపికి డిపాజిట్ దక్కదు
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ప్రసంగంలో అబద్ధాలు, ఆధార రహిత ఆరోపణలు మినహా మరోటి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చ లేకపోయావని పీఎం మోడీ అని, శనివారం నాటి మునుగోడు సభలో సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తే ఎందుకు సమాధాన చెప్పలేదని నిలదీశారు.రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నకు ప్రధాని మోడీ దగ్గరే సమాధానం లేదని ఇక అమిత్ షా దగ్గర సమాధానం ఉంటుందని తెలంగాణ సమాజం ఎంత మాత్రం భావించడం లేదని స్పష్టం చేశారు.ఆదివారం మునుగోడులో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడిన మాటలపై మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కేంద్రంలో స్పందించారు.బండి సంజయ్ నోట్లో నోరు పెట్టి మాట్లాడినట్లు ఉంది మినహా కొత్త దనం ఏమాత్రం కనిపించ లేదన్నారు.అమిత్ షా చేసిన ప్రసంగం హోంమంత్రి స్థాయికి తగినట్లు లేవన్నారు. ఓట్లు, సీట్లు అధికారం తప్ప మరొకటి ఆయన మాటల్లో వినిపించలేదన్నారు.మునుగోడు ప్రజల ఆశలు నిరాశాలయ్యాయని పేర్కొన్నారు.దేశాన్ని ఏలుతున్న పార్టీలో రెండో స్థానంలో ఉన్న పెద్ద మనిషి వచ్చినప్పుడు తమ గోడు పెద్దదని వచ్చిన పెద్ద మనిషి వరాల జల్లు కురిపిస్తారనుకుంటే అది వమ్ము అయిందన్న భాద ప్రజల్లో కనిపించిందన్నారు.అంతిమంగా సీఎం కేసీఆర్ చెప్పిందే నిజం అవుతుందని, మోటర్లకు మీటర్లు పెట్టాలన్నదే పీఎం మోడీ ఎజెండా అని దుయ్యబట్టారు.మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డలు చైతన్యవంతులని బిజెపికే ఇక్కడి ప్రజలు మోటార్లు బిగిస్తారని,రేపటి ఉప ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్ దక్కదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.