మేడ్చల్(జనంసాక్షి) : జిల్లాలో పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) మేడ్చల్, మల్కాజిగిరి కమిటీ అధ్వర్యంలో సోమవారం అంతాయిపల్లిలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు లేదా ఇలా పట్టాలు ఇవ్వాలని కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా “జర్నలిస్టుల డిమాండ్స్ డే” ను పాటిస్తూ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి ఈ మేరకు వినతిపత్రాలు సమర్పిస్తున్నమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు ఇవ్వాలని కోరారు. చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు, అడ్వర్టైజ్ మెంట్స్ పెంచాలన్నారు. జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు పునరుద్ధరించాలని కోరారు. బస్ పాస్, రైల్వే పాస్ లపై వంద శాతం రాయితీ కల్పించాలన్నారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు సైతం ఆర్టీసీ బస్ రాయితీ వర్తింపజేయాలన్నారు. అదే విధంగా జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా జర్నలిస్టుల రాత్రి వేళల్లో రవాణా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు ”జర్నలిస్టుబంధు” పథకం ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్, కోశాధికారి బెలిదే అశోక్ గుప్తా, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐఎఫ్ డబ్ల్యూజె) జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తన్నీరు శ్రీనివాస్, యవాపురం రవి, పటేల్ నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు పత్రాల సురేష్ గౌడ్, రవి చారీ, సంయుక్త కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్, గుమ్మడి హరిప్రసాద్, పరుశురాం, ఎం విష్ణు, భాస్కర్, దుర్గారావు, నాగరాజు గౌడ్, ఆంజనేయులు, రజిని మంజుల రెడ్డి, బాలరాజు, వీరేష్ ముదిరాజ్, కోట్ల రాజు, దినకర్, రాజేష్, రవీందర్ రెడ్డి, డేవిడ్, వెంకట్ సంజీవరెడ్డి, సౌభాగ్యవతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.




