Wednesday, 4 November 2026

అవిశ్వాస నోటీస్‌ సెక్రటరీకి పంపాం : రేవంత్‌

హైదరాబా,మార్చి26 (జ‌నంసాక్షి) : అసెంబ్లీలో ఎన్నడూ చూడని ఘటనలు జరుగుతున్నాయని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అవిశ్వాస నోటీస్‌ ఇవ్వడానికి వెళితే అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ మమ్మల్ని వర్గ శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు. తన వ్యతిరేకులు తెలంగాణలో జీవించకూడదన్నట్లు కేసీఆర్‌ తీరు ఉందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లు వస్తే మాకు 22 శాతం వచ్చాయన్నారు. అవిశ్వాసం నోటీస్‌ ఇద్దామని అసెంబ్లీకి వెళితే అడ్డుకున్నారని దీంతో అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాసం నోటీస్‌ పంపించామని రేవంత్‌ తెలిపారు. అసెంబ్లీలో జరిగే పరిణామాలపై విపక్షాలు ఆలోచించాలని మరో నేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మా గొంతు నొక్కినట్లుగానే త్వరలో విూ గొంతు నొక్కుతారని హెచ్చరించారు. అవిశ్వాస నోటీస్‌ను చర్చకు స్వీకరించాలని సండ్ర వెంకటవీరయ్య కోరారు.  తెలంగాణ ప్రభుత్వం తెదేపా ఎమ్మెల్యేల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను శాసనసభ ప్రాంగణంలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. సభ నుంచి సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం  బుధవారం శాసనసభ లాబీల్లోకి రాకుండా అడ్డుపడ్డారని, గురువారమైతే  అసెంబ్లీ గేటు బయటే అడ్డుకుని పోలీసు వాహనాల్లో తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు ఆశలు కల్పించిన తెరాస… ఇప్పుడు ఎమ్మెల్యేలను పోలీసు బలంతో అణచివేస్తుందని ధ్వజమెత్తారు. నిజాం పాలనలో సైతం ఇలాంటి నియంతృత్వ పోకడలు కనిపించలేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ పార్టీ నేతలకు కనువిప్పు కలగాలన్నారు.ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత బయటపడిందని  ఆరోపించారు. ఇక రేపు హైదరాబాద్‌ లో ఉండనిస్తారో లేదోనని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సస్పెండైన ఎమ్మెల్యేలు సభలోకి వెళ్లడానికి మాత్రమే వీళ్లేదని అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సస్పెన్షన్‌ వ్యవహారంలో ప్రభుత్వ తీరు బాగోలేదన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *