ఈనెల 27న జంటనగరాల్లో ఆటోల బంద్
హైదరాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): ఆటో ఫైనాన్స్ మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే రూపొందించాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస ఈ నెల 27న ఒక్కరోజు జంట నగరాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేదని ఆటో డ్రైవర్ ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. రోజురోజుకు ఫైనాన్సర్ల ఆగడాలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని, మరోపక్క చలానాల పేరుతో పోలీసులు ఆటో డ్రైవర్‌లను వేధిస్తున్నారని వారు మండిపడ్డారు. చట్టబద్ధత లేని ్గ/నాన్స్ కంపెనీలు అమాయక పేద ఆటో కార్మికులపై గుండాలతో నిలువుదోపిడికి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే వీరి ఆగడాలను అరికట్టకపోతే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.




