Thursday, 5 November 2026

ఆధ్యాత్మికం

తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి

హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): తప్పులు తెలుసుకొని తన నడవడికను మార్చుకునేవాడే మాననీయుడు. పొరపాట్లు చేయడం అలవాటుగా మారినవారు తమను తాము దిద్దుకోవడం కష్టతరమవుతుంది. రావణుడు తప్పులు చేయడంవల్లే రాక్షసుడయ్యాడు. ఇలాంటివారికి బంధువర్గమే శత్రువులై పతనానికి కారణమవుతారు. ‘నా సోదరుడే నీ వైపు ఉండకపోయి ఉంటే… నన్ను చంపడం నీ తరం కాకుండేది రామా’ అంటాడు రావణుడు తన చరమ దశలో. తన పొరపాట్లు తెలుసుకొని మంచిమార్గాన్ని ఎంచుకొన్న మారీచుడు రామాయణంలో రావణుడికన్నా గొప్పవాడనిపించుకొన్నాడు. పొరపాట్లను సరిదిద్దుకొని మహానుభావుడిగా నిలిచిపోయినవారిలో అశోకుడు చక్కని ఉదాహరణ. దుష్టుడైన చెలికాడికన్నా, గుణాత్ముడైన శత్రువు మేలని అందుకే అంటారు. తప్పులే చేస్తూ బతికేవాడి దృష్టిలో సమాజం భిన్నంగా వ్యక్తమవుతుంది. తప్పులు చేయనివారెవరో చెప్పండి అంటూ కొందరు దబాయిస్తుంటారు. నిరంతరాయంగా తప్పులుచేస్తూనే జీవనం సాగించేవాడు ప్రపంచంలోని ఎన్నో ఆనందాలను కోల్పోతాడు. తనవారి అనురాగానికి దూరమవుతారు. కన్నవారి ప్రేమ, భార్యాబిడ్డల విశ్వాసం, సమాజం నుంచి లభించే గౌరవం వాడికి తెలియని అనుభవాలవుతాయి. అన్యాయంగా సంపాదించే సంపదకన్నా చేతిలో సదా దైవస్మరణకు అవసరమయ్యే జపమాల విలువైనదని స్వాతి తిరుణాల్‌ అన్నారు. సామాజిక తప్పిదాలు దురభిమానానికి కారణమవుతాయి. అవివేకత్వానికి హేతురహిత బతుక్కి దారి తీస్తాయి. దీంతో తామేమిటో వారు తెలుసుకోలేరు. ఇతరులను సైతం అర్థం చేసుకోలేరు. సహజంగా వీరిని విజయం వరించదు. స్వాభావిక శ్రేష్ఠత్వమే గెలుపునకు కారణమవుతుంది.

——