ఫోటో రైటప్: బాధిత కుటుంబానికి నగదు అందజేస్తున్న కోవిడ్ వాలంటీర్ల బృందం.
బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం గ్రామంలో నిరుపేద కుటుంబం తమ కుమారునికి మతిస్థిమితం లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించడానికి చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్న విషయం తెలుసుకున్న నెన్నెల కోవిడ్ వాలంటీర్ల బృందం ఆదివారం రండి ఆసుపత్రిలో చేర్చి పేద కుటుంబాన్ని ఆదుకుందాం అని పిలుపునివ్వడం తో దాతలు స్పందించారు. వివరాల్లోకి వెళితే నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన వేల్పుల రాజేశ్ ఇద్దరు ఆడపిల్లల తండ్రి. నిరుపేద కుటుంబంలో అనుకోని విపత్తుతో ఉన్న రెండు ఎడ్లు, కచ్చులం బండి గీరల (చక్రాలు)అమ్మి మరీ కనిపించిన ఆసుపత్రుల్లో ధారపోసి చేతిలో చిల్లగవ్వ లేకుండా అయిన కుటుంబం. వాళ్ల తల్లీ కనిపించినవాళ్లకు మొక్కుతూ తన కొడుకును కాపాడమని వేడుకుంటూ ఉంది. మతిస్థిమితం కోల్పోయిన తనను హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చి తిరిగి యదా స్థితికి చేర్చుకొనే ప్రయత్నంలో కనీసం ఆసుపత్రికి తరలించే డబ్బులు లేక విలవిల్లాడుతున్న కుటుంబాన్ని తలో చెయ్యి వేసి ఆదుకుందాం అని కోవిడ్ వాలంటీర్ల పిలుపు మేరకు మానవత్వంతో స్పందించి తోచిన సహాయాన్ని అందించారు. దాతల ద్వారా ₹ 5,600 నగదు సేకరించి అందజేశారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్ తన స్వంత ఖర్చుతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి ఆసరాగా నిలిచిన కోవిడ్ వాలంటీర్ల బృందాన్ని మండల వాసులు అభినందించారు. ఈకార్యక్రమంలో కోవిడ్ వాలంటీర్ల బృందం సమన్వయ కర్త జలంపల్లి శ్రీనివాస్, సోపతి వెల్ఫేర్ సొసైటీ జైపూర్ సభ్యులు పాల్గొన్నారు.
ఆపన్న హస్తం అందించిన కోవిడ్ వాలంటీర్లు.




