కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్,మే15(జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ ఆరోరోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. వివిధ జిల్లాల్లో మంత్రుల, ఎమ్మెల్యేలు, అదికారులు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని రేగళ్ల, పునుకుల గ్రామంలో ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రైతులకు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. యాదాద్రి భవనగిరి జిల్లా రాయగిరిలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖరరెడ్డి, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రైతులకు రైతు బంధు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు రైతులకు రైతు బంధు చెక్కులను అందజేశారు. నిజామాబాద్‌లో ఎంపి కవిత పాల్గొన్నారు. తెలంగాణ రైతన్నల సంక్షేమ కోరి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రైతుబంధు చెక్కులు అందుకున్న మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడు అని కొనియాడుతున్నారు.
చెక్కులను రిటర్న్ చేసిన ఎర్రబల్లి
జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం చెన్నూర్ గ్రామంలో జరిగిన రైతుబంధు పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నూర్ గ్రామంలో తనకు వచ్చిన రూ. 12 వేల చెక్కును, అదేవిధంగా తన కుమారుడు ప్రేమ్ చందర్‌రావు పేరున వచ్చిన రూ. 27 వేల చెక్కును ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి కోసం గ్రామ సమన్వయ సమితికి అందజేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి తనకు రైతుబంధు పథకం ద్వారా వచ్చిన రూ. 12 వేల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి సంఘానికి విరాళంగా ఇచ్చారు.
జనగాం జిల్లాలోని పెద్దపహాడ్‌లో రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ జరిగింది. అర్హూలైన మహిళా రైతులకు వీఆర్‌వో రైతుబంధు చెక్కులను, పట్టాదార్ బుక్స్‌ను పంపిణీ చేశారు. 892 పాస్‌బుక్స్, 1014 చెక్కులు పంపిణీ చేసినట్లు వీఆర్‌వో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆ క్యాంపు సందర్శించారు. రైతుబంధు చెక్కు అందుకున్న మహిళా రైతు చల్లా కల్పన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులందరూ రుణపడి ఉంటారని చెప్పారు. పంట పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయమన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి అభినందనీయమన్నారు. ఈ పథకం ద్వారా రైతులు లబ్ది పొందడమే కాకుండా.. పంట దిగుబడి కూడా
పెరిగే అవకాశం ఉందన్నారు. తనకు 5 ఎకరాలకు గానూ 20 వేల రూపాయాల చెక్కు వచ్చిందని కల్పన చెప్పారు. ఇక పెద్దపహాడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు చల్లని మజ్జిగ, నీరు అందిస్తున్నారు. ఆశా వర్కర్లు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి రైతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.




