– ఉద్యోగ సంఘం నేతలు కేసీఆర్‌కు తొత్తులుగా మారారు
– తిడుతున్నా వారికి బుద్ది రావటం లేదు
– గౌరవ అధ్యక్షుడిగా హరీష్ ఉండటమే కేసీఆర్‌కు కోపం తెప్పిస్తుంది
– కేటీఆర్, కవితల్లో ఎవరైనా ఉంటే అసలు సమస్యలే రావు
– ఆర్టీసీ కార్మికులంతా ఏకమై కేసీఆర్‌కు బుద్ది చెప్పాలి
– విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మే17(జనం సాక్షి ) : ఆర్టీసీ కార్మికులను బెదిరించే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఓ నియంతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ముందు కేసీఆర్ ఈ మాట అంటే బాగుండేదన్నారు. కేసీఆర్‌కు బంధువు కాబట్టే రమణారావును ఆర్టీసీ ఎండీగా
కొనసాగిస్తున్నారని పొన్నం ఆరోపించారు. సమ్మెకు దిగుతామన్న కార్మికులను కేసీఆర్ బెదిరిస్తున్నారన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా హరీష్ ఉండడం కేసీఆర్‌కు కోపాన్ని తెప్పిస్తోందని.. అదే కేటీఆర్, కవితను గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికులు రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పొన్నం పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంఘ నాయకులు పదవుల కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘం నాయకులు కేసీఆర్‌కు తొత్తులుగా మారారని, వాళ్లు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పీఆర్సీ కమిటీ, బదిలీలపై గడువుపెంపు తప్ప ఉద్యోగుల మేలుకోసం సీఎం కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్న ట్రిబ్యునల్‌ను కేసీఆర్ సర్కార్ ఎందుకు రద్దు చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని పొన్నం విమర్శించారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడే ఉద్యోగులకు 39 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే.. అంతకంటే కేవలం మూడు శాతం పెంచి గొప్పలు చెప్పుకోవడం తప్ప కొత్తగా చేసిందేవిూలేదని ఎద్దేవా చేశారు. అయినా ఈ విషయంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను అని ఏం లాభం లేదని.. దీనికంతటికీ ఉద్యోగ సంఘం నేతలే పరోక్ష కారణమని ఆరోపించారు. రిటైర్‌మెంట్ తర్వాత ఉద్యోగ సంఘం నేతలు ఎమ్మెల్యే టికెట్ల కోసమే ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని పొన్నం ఆరోపించారు. ఎక్కువగా మాట్లాడేవారిని చెప్పుతో కొట్టాలంటూ కేటీఆర్ మాట్లాడినా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నా వారికి బుద్ధి రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ తాబేదార్లుగా మారడం వల్ల ఆంధ్రాలో నాలుగో తరగతి ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారంటూ ఆయన విమర్శించారు.




