– విధుల నుంచి తొలగించటానికి నీ ఇంట్లో పనోళ్లు కాదు
– కార్మికులకు మద్దతుగా అన్నిడిపోల ఎదుట ధర్నాలు చేస్తాం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్, అక్టోబర్7( జనం సాక్షి ) : సీఎం కేసీఆర్ అహకార పూరితంగా మాట్లాడుతారని, ఆయన తీరు సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు బెంగాల్లో, కేరళలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారా
అనిఅన్న కేసీఆర్ మాటలకు తమ్మినేని కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్టాల్ల్రో తమ ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులను ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నామని అని అన్నారు. వారికి పెన్షన్ సదుపాయంతో పాటు ఉద్యోగ భద్రతనుకూడా కల్పించామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు రెండునెలల ముందు నోటీసిచ్చి సమ్మె ప్రారంభించారని, వారి సమ్మె చట్టబద్ధమైందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఒక్క కలంతో 50 వేల మంది ఉద్యోగాలను తొలగించడానికి వారు కేసీఆర్ ఇంట్లో పనివాళ్లుకాదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తొమ్మిదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్నిడిపోల ముందు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు హుజూర్ నగర్ నామినేషన్ తిరస్కరణకు బాధ్యులైన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, అక్కడ తెలంగాణ ప్రజాపార్టీకి చెందిన సాంబశివ గౌడ్‌కు తాము మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తమ్మినేని స్పష్టం చేశారు.




