దమ్ముంటే హైదరాబాద్‌లో గెల్చి చూపాలి: ఓవైసీ
హైదరాబాద్,జూన్30(జనం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధైర్యముంటే మోదీ, అమిత్‌షా హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తన మద్దతు దారులతో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ… అందరూ హైదరాబాద్ సీటును మా నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. దమ్ముంటే ఎవరైనా హైదరాబాద్ నుంచి ఎంఐఎం విూద పోటీ చేయాలని సవాల్ విసురుతున్నా..అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సైతం ఇక్కడ పోటీచేయాలంటూ సవాల్ చేశారు. హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌కు సైతం చాలెంజ్ చేస్తున్నా.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా మమ్ముల్ని ఓడించలేరు. అని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. మోదీ ‘మాయలోడు’ అంటూ ప్రధానమంత్రిని ప్రముఖ మ్యాజిషియన్ పీసీ సర్కార్‌తో పోల్చారు. మైనారిటీలు, దళితులపై జరుగుతున్న దాడులపైనా ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. జూన్ 25ను బ్లాక్‌డేగా పాటించాలంటూ మోదీ చెబుతున్నారనీ… అయితే మహాత్మాగాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లు సహా స్వతంత్ర భారత దేశంలో చోటు చేసుకున్న కల్లోల ఘటనలను ప్రజలు మర్చిపోరని పేర్కొన్నారు. మైనారిటీ సభ్యులపై వివక్ష చూపించే విధంగా అధికార బీజేపీ పార్టీ ఆరెస్సెస్ అజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు.




