Tuesday, 3 November 2026

ఇజ్రాయిల్‌ తరహాలో పోలీసులకు శిక్షణ సత్ఫలితాలు ఇస్తున్న తర్పీదు

హైదరాబాద్‌,జ‌నంసాక్షి): ఆత్మరక్షణలో పోలీసలుఉ తెలివిగా ప్రవర్తించి, దుండగులను పట్టుకునేలా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి తగు శిక్షణ ఏర్పాటు ఇచ్చారు. తర్ఫీదు సాంతం అధునాతన శాస్త్రీయ పద్ధతుల్లో ఉండటం సిబ్బందికి ఉపకరించేదిగా మారింది. ముష్కరుల బారి నుంచి కాపాడుకోవడంతో పాటు వారిని పట్టుకునేలా మెళకువలు నేర్పారు. దీంతోనే సరిపెట్టకుండా అందుకు అవసరమైన మెళకువల్ని నేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించడం ఎంత ముఖ్యమో.. ప్రాణాల్ని కాపాడుకుంటూ దుండగుల భరతం పట్టడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం అంతకంటే కీలకం అని భావిస్తున్నారు. గతంలో జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగానే భద్రతపరమైన పలు అంశాల్లో కానిస్టేబుళ్ల నుంచి మొదలుకొని ఎస్సైల వరకు శిక్షణ ఇస్తున్నారు. పోలీస్‌ సిబ్బందికి ఆత్మరక్షణ చర్యలతోపాటు దుండగులను నిలువరించేందుకు ఇచ్చే శిక్షణను ఉన్నతాధికారులు పదునైన వ్యూహాలతో రూపొందించారు. దేశంలో అప్పటివరకు ఏ కమిషనరేట్‌లో లేనివిధంగా ఈ శిక్షణకు శ్రీకారం చుట్టారు. ఇజ్రాయెల్‌ సైన్యం అనుసరించిన వ్యూహాలతో కూడుకున్న ఈ శిక్షణ ఇచ్చారు. దుండగులను పట్టుకునే క్రమంలో పోలీసులు తమ వద్ద ఉండే ఆయుధాల్ని జాగ్రత్తగా ఉంచుకుంటూనే వారిని లొంగదీసుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా దుండగులు వాటిని లాక్కొని తెగబడేందుకు ఆస్కారముంటుంది. ఒకవేళ దుండగుల వద్ద ఆయుధాలుంటే వాటిని ఒడుపుగా ఎలా స్వాధీనం చేసుకోవాలన్నది కూడా శిక్షణలో నేర్పించారు. పోలీస్‌ సిబ్బందిలో శారీరక సామర్థ్యానికి అధిక ప్రాధాన్యముంటుంది.