Wednesday, 4 November 2026

ఈనెల 8న చేప ప్రసాదం పంపిణీ 

– నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు
హైదరాబాద్‌, జూన్‌5(జనం సాక్షి) : చేప ప్రసాదం  పంపిణీకి  ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రతీ  ఏడాది లాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్‌  గ్రౌండ్‌ లో  చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మరో మూడు రోజులే  మిగిలి ఉండడంతో.. పనులు చకచకా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి  కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిఏటా బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని జనానికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఏటా మృగశిరకార్తె రోజు ఇచ్చే ఈ చేప ప్రసాదం కోసం పెద్దసంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కి తరలివస్తారు. ఎప్పటిలాగే ఈఏడు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌స్‌లో చేప ప్రసాదం పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని సోదరుల సొంత ఇంటి నుంచి ప్రారంభించిన ఈ చేప ప్రసాదం పంపిణీ రద్దీ పెరగడంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ కి మార్చారు. చేప ప్రసాదానికి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. క్యూలైన్స్‌, బారికేడ్స్‌ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లడ్‌ లైట్స్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో.. చలువ పందిళ్లు, ఫ్యాన్లు  ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. అంతకుముందు రోజు.. దూద్‌ బౌలిలోని బత్తిని సోదరుల ఇంట్లో పూజల తర్వాత ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు బత్తిని వీరన్న గౌడ్‌. చేప ప్రసాదం కోసం మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను అందిస్తోంది ప్రభుత్వం. ఈసారి కూడా లక్షల్లో ఆస్తమా రోగులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.