ఈ నెల 9న గణనాథుల నిమజ్జనం

 భానుపురి ఉత్సవ కమిటీ అధ్యక్షులు అనంతుల కృపాకర్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): పట్టణంలో నెలకొల్పిన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఈనెల 9న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్ తెలిపారు.గురువారం నిమజ్జనంపై పట్టణంలోని ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జనం ఎప్పుడు చేయాలో అనే సందిగ్ధంలో ఉన్న విషయమై కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిమజ్జన తేదీని ఖరారు చేశారు.ఆగస్ట్ 31న ప్రారంభమైన గణేష్ నవరాత్రులు ఈ నెల 8న ముగియనున్నాయి.9వ తేదీన  నిమజ్జనం చేసే విధంగా నిర్ణయించారు.ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం కు వెళ్లే రోడ్
నుండి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా ఏర్పడ్డ గుంతలను కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్ తన సొంత ఖర్చులతో జేసీబీని ఏర్పాటు చేసి గుంతలను చదును చేయించడం జరిగింది.నిమజ్జనానికి వచ్చే శోభయాత్రకు ఎలాంటి ఆటంకం జరగకుండా మున్సిపల్ , పోలీస్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.గతంలో మాదిరిగానే సూర్యాపేటలో నెలకొల్పిన గణేష్ విగ్రహాలను పట్టణంలోని చౌదరి చెరువులో నిమజ్జనం చేసేందుకు పురపాలక సంఘం వారు ఎప్పటిలాగే రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారని, దూర ప్రాంతాలకు వెళ్లకుండా సూర్యాపేట పట్టణంలోనే గణనాథులు నిమజ్జనం చేసి ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భానుపురి గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు , ఉపాధ్యక్షులు బైరు వెంకన్న గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చలమల్ల నర్సింహ్మ , తోట శ్యామ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.