నేడు కేబినేట్ సమావేశానికి రంగం సిద్దం
హైదరాబాద్‌కు చేరుకోవాలని మంత్రులకు ఆదేశాలు
కేబినేట్ భేటీ తరవాత నేరుగా గవర్నర్‌ను కలవనున్న కెసిఆర్
విపక్షాల్లోనూ మొదలైన హడావిడి
హైదరాబాద్,సెప్టెంబర్5(జనం సాక్షి): తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైంది. సచివాలయంలో అధికారుల హడావిడి కనిపించింది. సిఎస్ ఎస్‌కె జోషిని పలువురు అధికారులు కలిశారు. టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలపై గురువారం స్పష్టమైన ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రులంతా రేపు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న మంత్రులు కూడా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. గురువారం ఉదయం కేబినెట్ భేటీ తర్వాత ప్రభుత్వ రద్దుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశముంది. అలాగే కేబినేట్ నిర్ణయం తీసుకున్న రద్దు విషయాన్ని గవర్నర్‌కు నివేదించనున్నారు. ఇదిలా ఉంటే, ఈ నెల 7న హుస్నాబాద్‌లో నిర్వహించే సభలో కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభకు సంబంధించి మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ వేదిక నుంచి ఎన్నికల సమర భేరి మోగించనున్నట్లు తెలిపారు. రాజకీయ ఎజెండా లక్ష్యంగా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముందస్తుఎన్నికలకు మెరుపు వేగంతో సిద్ధంగా ఉన్నామని ఈటల ప్రకటించడాన్ని గమనిస్తే టీఆర్‌ఎస్ ముందస్తు వెళ్లడం పక్కాగా కనిపిస్తోంది. ఇక టీ కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోనే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ‘ముందస్తు’ ఎన్నికల హడావుడి నెలకొంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయాల్లో వేడి నెలకొంది. టి.కేబినెట్ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దీనిపై రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సై అంటున్నాయి. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ని ఇంటికి సాగనంపాలని పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ను ఢీకొనేందుకు విపక్షాల సహాయం తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. అంతర్గతంగా విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో మహా కూటమి ఏర్పడేందుకు అడుగులు పడుతున్నట్లు టాక్. టి.టిడిపి, టీజేఎస్, వామపక్షాలు సిద్ధమయ్యాయని, ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో ఓ దఫా చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. మొత్తం 119 సీట్లున్న రాష్ట్రంలో టిడిపికి 15, కోదండరాం పార్టీకి 6, సీపీఐ 4, సీపీఎం 4 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ పొత్తుల వ్యవహారాన్ని కాంగ్రెస్ అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్లు వినికిడి. కానీ ఈ పొత్తుల విషయంలో కాంగ్రెస్ నెతలెవరూ స్పందించడం లేదని సమాచారం. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే ఈ అంశాలపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం.




