Wednesday, 4 November 2026

మత్సకారుల ఆర్థికాభివృద్దికి చర్యలు

మత్స్య అభివృద్ధి పథకం కింద ఉపకరణాలు పంపిణీ

చేపలతో ఆర్థికంగా ఎదగాలన్న మంత్రి తలసాని

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాష్ట్రంలోని మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా మత్స్యకారులను ముందుకు తీసుకెళ్లాలనేదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు. నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో మత్స్య అభివృద్ధి పథకం కింద ఉపకరణాలు పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రులు, ఎంపీలు తిలకించారు. ఉపకరణాలు పరిశీలించిన మంత్రులు.. 31 జిల్లాల నుంచి వచ్చిన మత్స్య సహకార సంఘాల నేతలు, మత్స్యకారులతో మాట్లాడారు. 885 మందికి ద్విచక్ర వాహనాలు, 12 మందికి లగేజీ ఆటోలు, 8 మందికి ట్రక్కులు, ఇతర ఉపకరణాలు పంపిణీ చేశారు. సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తలసాని ప్రసంగించారు. తెలంగాణలో పుట్టిన చేప పిల్లలను ప్రపంచానికి అమ్మే యత్నం చేస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో చట్టసభల్లోకి గంగపుత్రులు వస్తారని చెప్పారు. గంగపుత్రులకు కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చేపలను దళారులకు కాకుండా మార్కెట్‌ తరలించాలని మత్స్యకారులకు సూచించారు. చేప పెరుగుతున్న సమయంలోనే అక్వా మార్కెట్‌ ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నారు.