Wednesday, 4 November 2026

ఎన్నికల సమయంలో బిజెపి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది : ఎల్బీనగర్నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి

విలేకరుల సమావేశంలో బండి సంజయ్ పై మండిపడ్డ జక్కిడి
ఎల్బీనగర్  (జనం సాక్షి )  ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రల పేరుతో కాలయాపన చేస్తున్నారని   ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ,  టి పిసిసి డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్‌లో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బిజెపి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పాదయాత్రల పేరుతో బండి సంజయ్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి పార్టీ ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలను నెరవేర్చారనే విషయాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి బిజెపి తన పబ్బం గడుపుకుంటుందని కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించిన తర్వాతే బిజెపి నాయకులు ప్రజల మధ్యకు రావాలని ఆయన హితవు పలికారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పాదయాత్రలు చేస్తే పాదయాత్రలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, బుడ్డ సత్యనారాయణ, ఇరిగి రమేష్, బొంగు వెంకటేష్ గౌడ్,  మల్లారపు శ్రీనివాస్, బొడిగె స్వామి గౌడ్, సతీష్ రెడ్డి,
మహ్మద్ షరీఫ్, జెల్ల లాలయ్య గౌడ్, సత్యనారాయణ రెడ్డి, స్వామి ముదిరాజ్, చందునాయక్ తదితరులు పాల్గొన్నారు