Wednesday, 4 November 2026

ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయాలకు హంగులు

ప్రజలకు చేరువగా ఇక ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధునాతన హంగులతో నిర్మిస్తున్న ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వాటిలో ప్రత్యేక సిబ్బందిని నియామకం
చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్‌ స్థాయి అధికారులు ఇద్దరు, గ్రామపంచాయతీ కార్యదర్శి స్థాయి అధికారులు నలుగురు, ఒక్కరు కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఇద్దరు రికార్డు అసిస్టెంట్‌లు, ఇద్దరు అటెండర్‌లను నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని అధికారులు పేర్కొన్నారు .శాసన సభ్యులకు శాశ్వత చిరునామాలుగా క్యాంపు కార్యాలయాల భవనాల నిర్మాణం జరుగనుంది.ప్రభుత్వాలు మారినా… ఎమ్మల్యేలు మారినా, అధికారంలో ఉండే శాసనసభ్యుల శాశ్వత క్యాంపు కార్యాలయాలుగా ఉంటాయి. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేలను కలవాలన్నా, వినతి పత్రాలు ఇవ్వాలన్నా
పక్కా చిరునామా లేకుండా పోయింది. సొంత గృహాల వద్ద ఇవ్వాలా.. ఎమ్మెల్యే క్వార్టర్ల వద్దా…ఇవ్వాలా .అన్న సందేహం ప్రజల్లో ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా నియోజకవర్గ కేంద్రాల్లో అధికారిక భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ భవనాలు ఆ నియోజకవర్గంలో ఎవరుంటే వారికి అధికారిక నివాసాలు కానున్నాయి.  నియోజకవర్గ ప్రజలు తమ గ్రామానికి అవసరమయ్యే పనులకు నిధులకోసం సంప్రదించాలన్నా వ్యక్తిగత పింఛన్‌, రెండు పడక గదుల మంజూరు తదితర ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వాలన్నా ఈ క్యాంపు కార్యాలయాల్లో స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. ప్రజలకు క్యాంపు కార్యాలయాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకున్నా, వినతి పత్రాలు స్వీకరించేందుకు కార్యాలయ సిబ్బందిని నియమించనున్నారు. సిబ్బంది అక్కడే ఉండేలా వారికి
కూడా క్యాంపు కార్యాలయం సవిూపంలోనే నివాసాలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌ నమూనాలో జిల్లాలోని శాసనసభ్యులకు అధికారిక నివాసాల నిర్మాణ పనులు జరుగనున్నాయి. సుమారు రూ.కోటి నిధులతో అన్ని హంగులు, అత్యాధునిక సదుపాయాలతో క్యాంపు కార్యాలయాల నిర్మాణం కానున్నాయి. అనేకచోట్ల ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. భవనాల నిర్మాణం పనులకు శిలాఫలకాలు వేశారు. జుక్కల్‌లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించే ఈ క్యాంపు కార్యాలయాలకు సుమారు రూ.కోటికి పైగా నిధులు వెచ్చించి ఆధునాతన హంగులతో నిర్మించనున్నారు. ఈ మేరకు భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాలను సైతం విడుదల చేశారు. ఒక్కో భవనాన్ని విశాలంగా నిర్మించేందుకు 600 చదరపు గజాలకు తగ్గకుండా స్థలం కేటాయించారు. ఎంపిక చేసిన స్థలంలో సమావేశపు గది, ఎమ్మెల్యే ఛాంబర్‌, రిసెప్షన్‌ గది, ముఖ్యులు వస్తే కూర్చోడానికి వీఐపీ లాంజ్‌, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులకు ప్రత్యేక గది వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు.