సద్వినియోగం చేసుకోవాలన్న అధికారులు
కరీంనగర్,అక్టోబర్29 (జనంసాక్షి,) : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో పాఠశాల విద్యను మధ్యలో మానేసిన వారు ఓపెన్‌స్కూల్‌లో చదువుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞానం, వృత్తి
విద్యా సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టింది. 14 ఏళ్లు నిండిన వారందరికీ దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 42 ఓపెన్ స్కూళ్లు ఉన్నాయి. విద్యపై మక్కువ, ఉన్నత విద్యను అభ్యసించాలనే అభిలాష ఉన్న వారికి ఓపెన్ స్కూళ్లు ఒక వరంగా మారాయి. ప్రతినెలా రెండో శనివారం, ప్రతీ ఆదివారం విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు. వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఈనెల31తో గడువు ముగియనుంది. అపరాధ రుసుంతో మాత్రం నవంబర్ 10 వరకు అవకాశం ఉంది. పదో తరగతిలో ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ఇంటర్మీడియట్ ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమతి లేదు. పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్‌లో బోధన విషయాలను మూడు గ్రూపులుగా విభజించారు. అభ్యాసకులే స్వయంగా బోధనా విషయాలు (స్జబెక్టులను) ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంటుంది. నిర్ధేశిరచిన అధ్యయన కేంద్రాల్లో ఉన్నత పాఠశాలలు/జూనియర్ కళాశాలల్లో సంప్రదించాలి. పదో తరగతిలో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాద్యమాల్లో ఉంటుంది.ఇంటర్‌లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పెన్ స్కూల్‌లో నమోదైన విద్యా సంవత్సరం చివరిలో (మార్చి/ఏప్రిల్) పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ అన్ని పరీక్షలు (5 లేక 6 స్జబెక్టులు) రాసేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఇంటర్ తుది పరీక్షకు కనీసం రెండేళ్లు అంతరం ఉండాలి. చదువును మధ్యలో ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా చదువు కొనసాగించే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని విద్యాధికారులు సూచించారు.




