పార్టీ బలోపేతానికి నేతల కసరత్తు
హైదరాబాద్,మే12(జనం సాక్షి): రానున్న ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకు క్షేత్రస్థాయిలో నాయకులకు, పార్టీ కార్యకర్తలకు వారుధులుగా పనిచేసే మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై దృష్టి సారించింది. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, ఇతర పార్టీల నుంచి అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలని కసరత్తు ప్రారంభించింది. దీంతో జిల్లాల్లో పార్టీ సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఈ యేడాది ఎన్నికలు వస్తాయని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆందోళనలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా… క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడానికి పార్టీ నేతలు యత్నిస్తున్నారు. కొత్త జిల్లాలకు పూర్తిస్థాయిలో అధ్యక్షులను నియమించలేదు. డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అర్హులేనని పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో ఆ పదవికి ఆశావహుల జాబితా ఎక్కువైంది. /ూష్ట్రం, కేంద్రంలో ‘ముందస్తు’ సన్నాహాకాలు వూపందుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఏడాది ముందుగానే అంటే.. ఈ ఏడాది చివరికి ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు.పార్టీ అధిష్ఠానం అందరినీ సమన్వయపరిచే నాయకుల కోసం వెతుకుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం… అన్ని వర్గాలను కలుపుకుపోగల సమర్థత, జిల్లా రాజకీయాల్లో వర్గ విభేదాలను పక్కనబెట్టి అంగ, అర్థ బలాల్లో గట్టిగా ఉన్నవారినే పార్టీ అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు తెలిసింది. కార్యకర్తల్లో నైతికసైర్థ్యం నింపేలా నాయకత్వం పనిచేయాలని పార్టీ
అధిష్ఠానం ఇటీవలే గట్టిగా హెచ్చరించింది. వచ్చే ఎన్నికలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోనే
జరుగుతాయని ఇప్పటికే పార్టీ అధిష్ఠాన వర్గం సంకేతాలు ఇచ్చింది. దీంతో ఎట్టిపరిస్ధితుల్లోనూ కార్యకర్తల్లో చులకన కావొద్దని.. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులను ఆదేశించడంతో పాటు సంస్థాగతంగా బలోపేతమై కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపడానికి మరికొన్ని రోజుల్లో డీసీసీ అధ్యక్షులతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వడపోసి ప్రకటించేలా కార్యచరణను రూపొందించనుంది. ముందస్తుగా అభ్యర్ధుల ప్రకటన ఆ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే. అయితే పార్టీని ముందుండి నడిపించి తీసుకుని వెళ్లగలిగేలా సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. అలాగే జిల్లాలో వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కత్తివిూద సాము లాంటిదే. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి సోదరుల మధ్య ఇప్పటికే తీవ్ర విభేదాలు వ్యక్తమయిన నేపథ్యంలో పార్టీ బలంగా ఉన్న ఈ జిల్లాలో మరింత కసరత్తు తప్పదని భావిస్తున్నారు. వర్గవిభేదాలు పక్కన పెడితేనే అధికార పార్టీని ఢీకొనగలమని అంటున్నారు. అయితే గుత్త సుఖేందర్ రెడ్డి లాంటి బలమైన నేత అధికార పార్టీకి వెళ్లడంతో కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చని ఓ వర్గం వాదిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.
……………….




