హైదరాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): అధికార దుర్వినియోగం వల్లే కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో కూడా అలాగే చేశారని అన్నారు. కాకినాడలో డివిజన్ల వారీగా భారీగా డబ్బులు పంచారని, పలుచోట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆమె వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగంతో గెలిచిన గెలుపు… గెలుపు కాదని అన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో టీడీపీ చాలాసార్లు డిపాజిట్ కోల్పోయిందని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. కాకినాడ, నంద్యాలలో అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హావిూల్లో ఒక్క హావిూని కూడా చంద్రబాబు అమలు చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. మాయ మాటలు చెప్పడంలో చంద్రబాబు డిగ్రీ చేశారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. డబ్బులు వెదజల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆమె మండిపడ్డారు. అవినీతి సొమ్మును వెదజల్లి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఓటేశారని టీడీపీ నేతలు చెప్పుకుంటు న్నారని, అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే చంద్రబాబుకు అభివృద్ధి గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతలంతా ఇంటింటికీ ప్రచారం చేస్తూ విూరు ఓటేయకపోతే పెన్షన్ ఆగిపోతుందని ఓటర్లను భయపెట్టారని అయినా ఇసి పట్టించుకోలేదన్నారు.




