చంద్రబాబు కృషికి ప్రజలు పట్టం కట్టారు
కాకినాడ ఫలితంపై చినరాజప్ప వ్యాఖ్య
కాకినాడ,సెప్టెంబర్1(జనంసాక్షి): తెలుగుదేశం పట్ల ప్రజల్లో విశ్‌ఆసం పెరిగిందని, అందుకు తాజాగా
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ¬ంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
కాకినాడ పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తంచేశారు.
టీడీపీ గెలుపుతో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గెలుపుపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీ విజయం సీఎం చంద్రబాబుకే అంకితం అని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించి ఓటు రూపంలో విజయాన్ని అందించారని మంత్రి అన్నారు. వైసీపీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని చినరాజప్ప జోస్యం చెప్పారు. కాకినాడ స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ఓటర్లు టీడీపీకి విజయాన్ని అందించారని చినరాజప్ప పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ప్రవర్తన, అసెంబ్లీలో బాధ్యతారహితంగా మాట్లాడటం, ప్రతిపక్ష నేతగా నిర్మాణాత్మక పాత్ర పోషించలేకపోవడంతో ఆయన పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. జగన్‌కు రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని గుర్తుచేస్తూ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారన్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ పురపాలక ఎన్నికలే 2019 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల నుంచి వెనక్కి పోవద్దన్నారు.