Wednesday, 4 November 2026

కెసిఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నాం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌దే విజయం

అవినీతి సర్కార్‌ను గద్దె దింపాలని ప్రజల కోరిక

ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఉత్తమ్‌

హైదరాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలు డిసెంబర్‌ లేదా మే నెలలో ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనన్నారు. ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు శుభవార్త అని.. తెరాస ప్రభుత్వాన్ని గ్దదె దించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అవినీతిమయమైన టీఆర్‌ఎస్‌ పాలనకు స్వస్తి పలికేందుకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ముందస్తు ఎన్నికలు అనేవి తెలంగాణ ప్రజలకు నిజంగానే శుభవార్త అని, కేసీఆర్‌ పాలన నుంచి కొన్ని నెలల ముందుగానే రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం పదే పదే తప్పుడు ఆరోపణలు, దుష్పచ్రారాలు చేయకుండా ఎలక్షన్స్‌కు పోదామా? విూ సంగతి మా సంగతి ప్రజలు తేలుస్తరని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సవాల్‌ చేసిన విషయం విదితమే. 2019 మే, 2018 డిసెంబర్‌, ఇవాళ అయినా సరే.. ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు రావడం తెలంగాణ ప్రజలకు శుభవార్త అని ఉత్తమ్‌ పేర్కొన్నారు. దానం నాగేందర్‌ చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని.. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడు తున్నాయని చెప్పారు. ప్రజలకు తమ ప్రభుత్వ పాలనపై పూర్తి నమ్మకమున్నదని.. అవసరమైతే ప్రజల మధ్యకు ముందస్తుగానే పోదామని ఆయన స్పష్టంచేశారు. గెలిచే అన్ని స్థానాల్లో 40వేల నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, విపక్షాల సంగతేమిటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సవాల్‌ చేశారు. విపక్షాలు సరేనంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని తనకు అనుమానంగా ఉందని, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తమ పార్టీ నేతలు చెబుతున్నారని తెలిపారు.దీంతో ఉత్తమ్‌ కూడా సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.

——-