Wednesday, 4 November 2026

వరుసగా రెండోరోజూ నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో చిన్నారి సహా 9మంది మృతి

రంగారెడ్డి జిల్లా లింగంపేట ఆటోను ఢీకొన్న కారు

నలుగరు రైతులు అక్కడిక్కడే మృతి: గ్రామస్థుల ఆందోళన

స్కూలు బస్సుకిందపడి చిన్నారి మృతి

హైదరాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డుప్రమాదాలు కలవరపెడుతున్నాయి. వరుసగా రెండోరోజు సోమవారం కూడా రోడ్లునెత్తురోడాయి. ఆదివారం ట్రాక్టర్‌ ప్రమాదంలో 15మంది జలసమాధి కాగా సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో కనీసం 9మంది మృతి చెందారు.సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లాలో మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంచాల మండలం లింగాల వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు మహిళలు మృతిచెందారు. చెన్నారెడ్డిగూడకు చెందిన 10 మంది మహిళలు కూరగాయలు మార్కెట్‌కు తరలించే నిమిత్తం ఆటోలో హైదరాబాద్‌ బయలుదేరారు. వారి ఆటో లింగాల వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌ శ్రీను, సుజాత, మాధవి, మారు, అఫిలి అక్కడికక్కడే మృతిచెందగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమాచారం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు, బంధువుల అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపెల్లి గేటు వద్ద రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు.. ఆటోను ఢీకొట్టింది. బాధితులు చెన్నారెడ్డి గూడెంకు చెందిన మహిళా రైతులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు వేగమే వారి ప్రాణాలు తీసింది. దీంతో మంచాల రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు రైతులు మృతి చెందడంతో రహదారిపై మృతదేహాలతో బంధువుల ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని ఆందోళన చేపట్టారు. చనిపోయిన వారికి రూ.25లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని బాధిత బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన మంత్రి మహేందర్‌ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. చిత్రీకరిస్తున్న విూడియా ప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు.

మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగాల వద్ద జరిగిన రోడ్డుప్రమాద మృతుల కుటుంబాలను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పరామర్శించారు. ఈరోజు ఉదయం మంచాల మండలం లింగాల వద్ద ఆటోను కారు వేగంగా ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు మహిళలు మృతిచెందారు. చెన్నారెడ్డిగూడకు చెందిన మహిళలు కూరగాయలను ఆటోలో హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆటో డ్రైవర్‌ శ్రీను, సుజాత, మాధవి, మారు, అఫిలిగా గుర్తించారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి హుటాహుటిన చెన్నారెడ్డిగూడకు చేరుకుని మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని హావిూ ఇచ్చారు. మంత్రి తిరిగి వెళ్తున్నసమయంలో బాధితుల సంబంధీకులు రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామని హావిూ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

బస్సుకిందపడి చిన్నారి మృతి

ఇకపోతే రంగారెడ్డి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. షాబాద్‌ మండలం గోపిగడ్డలో ఏడాదిన్నరి చిన్నారి ఆద్య పాఠశాల బస్సు కింద పడి మృతిచెందింది. తన అన్నను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తండ్రిలో కలిసి బయటకు వచ్చిన ఆద్య అక్కడే ఆడుకుంటూ బస్సు కిందకు వెళ్లింది. పాపను గుర్తించని డ్రైవర్‌ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

కెనాల్‌ను ఢీకొన్న బైక్‌: ఇద్దరు మృతి

వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుప్లలె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్‌ బ్రిడ్జ్‌ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు పర్వతగిరి మండల కేంద్రంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ ను నడుపుతున్నారు. వరంగల్‌ కు ఫాస్ట్‌ ఫుడ్‌ కు సంబంధించిన వస్తువులు తీసుకుని పర్వతగిరికి తిరిగివస్తుండగా బైకు అదుపుతప్పి బ్రిడ్జ్‌ ని ఢీకొట్టింది. దీంతో రాము, ఇతడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. మృతులు రాము స్వగ్రామం పర్వతగిరి మండలం చెర్వుకొమ్ముతండా కాగా, మరో యువకుడు నేపాల్‌ కు చెందిన ఇతడిగా పోలీసులు గుర్తించారు.

కల్వర్టును ఢీకొన్న బైకు: ఒకరు మృతి

జనగమాలో జరిగిన మరోప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నూనెగూడెం సవిూపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్‌ కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతు యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన అమనగంటి రాజశేఖర్‌, గుండాల మండలం నూనెగూడెంకు చెందిన లొంక కరుణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రాజీవ్‌ రహదారిపై ప్రమాదం

ప్రజ్ఞాపూర్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్‌కు చెందిన కొందరు విద్యార్థులు తమ స్నేహితుని పెళ్లి కోసం అద్దె కారులో ఆదివారం మంచిర్యాలకు వచ్చారు. పెళ్లి పూర్తి అయిన తరువాత వారు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్‌ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీకొంది. దీంతో అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని బొల్లా పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.