బ్యాంకుల తీరుతో మళ్లీ ఈ వైపుగా పెట్టుబడులు
పెరుగుతున్న వ్యాపారలావాదేవీలు
హైదరాబాద్,జూలై21(జనం సాక్షి): పెద్ద నోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం కకావికలమయినట్లే కనిపించినా బ్యాంకుల వైఫల్యంతో ఇప్పుడు మళ్లీ పెట్టుబుడులు ఈ దిశగా మళ్లుతున్నాయి. జిఎస్టీతో పాటు, ఆధార్ అనుసంధాన ప్రక్రియలు ఈ రంగానికి భారంగా పరిణమించినా ఎందుకనో ప్రజలు మళ్లీ ఇటువైపు పెట్టుబడులకు మళ్లుతున్నారు. జిఎస్టీలో సిమెంట్, గ్రానైట్ పరిశ్రలకు ప్రోత్సాహకాలు ఉంటాయనుకుంటే అవి నీరుగార్చాయి. అందుకు అనుగుణంగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడలేదు. తొలుత నిర్మాణరంగంలో ఉన్న కూలీలు ఉపాధి లేకుండా పోయారు. అమ్మకాలు, కొనుగోల్లు పడిపోయాయి. వడ్డీరేట్లు తగ్గితే కొంతయినా ఈ రంగం నిలబడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యింది. భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యుడికి ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుందని పదేపదే చెప్పినా అలాంటి వెసలుబాటు ఏదీ రాలేదు. అందరికీ ఇల్లు అన్న ఆశ అడుగంటింది. గతంతో పోలిస్తే ఈ రంగంలో ఖర్చులు ఇప్పుడు విపరీతంగా పెరిగాయి. ధరలు పెరిగాయి. సిమెంట్,స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. మొత్తంగా గృహనిర్మాణ రంగం లేదా రియల్ రంగం బాగా ఊపులో ఉంది.ధరలను లెక్క
చేయడకుండా డబ్బున్న వారు పెట్టుబడుకలు ముందుకు వస్తున్నారు. బ్యాంకులపై నమ్మకం కోల్పోవడంతో రియల్ రంగంపై ఆశలు పెరిగాయని ప్రముకబిల్డర్లు అంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు పడిపోయిన రియల్ ఎస్టేట్ విక్రయాలు మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు పుంజుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గడిచిన రెండేళ్లల్లో రెసిడెన్షియల్ మార్కెట్‌పై తీవ్రస్థాయిలో ప్రభావం పడిందన్నారు. ముఖ్యంగా సెకండరీ విక్రయాలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. 2010 తర్వాత ఇంతటి స్థాయిలో అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి.2016 తొలి తొమ్మిది నెలల్లో గృహాల అమ్మకాలు మెరుగైన వృద్ధిని నమోదు చేసుకోగా, నవంబర్‌లో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో డెవలపర్లలో భయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నూతన ప్రాజెక్టులను ప్రకటించడానికి జంకారు. ఇప్పుడు మళ్లీ జిఎస్టీ కారణంగా ధరలు అమాంతంగా పెరిగాయి. హైదారాబాద్ లాంటి నగరాల్లో అమ్మకాలు, కొనుగోళ్లపై తీవ్రప్రభావం చూపింది. ఇది కాస్తా అన్ని రంగాలను ప్రభావితం చేసింది. అయితే బ్యాంకుల వైఫల్యాలు, భయాల కారణంగా ప్రజలు తమ పొదుపు పెట్టుబడిని రియల్ రంగానికి మళ్లిస్తున్నారు. దీంతో హైదరాబాద్ సమా జిల్లాల్లో కూడా ఈ రంగం మళ్లీ కళకళలాడుతోంది.




