ఘనంగా ఏర్పాట్లు చేసిన సింగరేణి
ఆదిలాబాద్,జనం సాక్షి): సింగరేణి సంస్థ రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా కోల్‌బెల్టు విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో, శ్రీరాంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సింగరేణిబొగ్గుగనుల ప్రధాన కేంద్రమైన కొత్తగూడెం లోని సింగరేణి ప్రధాన కార్యాలయం, జిల్లా నడిబొడ్డున ఉన్న సింగరేణి స్టేడియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. సింగరేణిలో తెలంగాణ అవతరణ రోజును పండుగా నిర్వహించాలని యాజమాన్యం పిలుపు నిచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి ప్రస్తుతం ఆరు జిల్లాల స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం సింగరేణి కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి రాష్ట్ర ప్రగతిలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ముచ్చటగా మూడేళ్ల తెలంగాణ అవతరణ వేడుకలను జరుపుకోవడంలో సింగరేణి సాధించిన ప్రగతి ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోనుంది. సింగరేణిలో పనిచేస్తూ సాధారణంగా మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. సహజ మరణాల వల్ల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో వారిపై ఆధారపడిన వారికి రూ.7.5 లక్షలను చెల్లించే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు. భూగర్భగనుల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను 2016లో మ్యాచింగ్ గ్రాంట్‌గా జతచేసి రూ.25 లక్షలను చెల్లించేందుకు ఏకంగా రూ.5 నుంచి రూ.25 లక్షలకు పెంచడం ద్వారా కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచింది. సింగరేణిలో టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా ఆవిర్భవించిన తరువాత ఉద్యోగ నియామకాలతో పాటు పదోన్నతులు, లాభాల బోనస్‌లు ఇప్పించడంలో టీబీజీకేఎస్ కీలకపాత్ర పోషించింది
—-




