Thursday, 5 November 2026

క్రీడాకారులకు ప్రభుత్వం తీపి కబురు

ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లకు ఉత్తర్వులు
హైదరాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోస్టర్‌ విధానంలో క్రీడాకారులకు 48, 98 పాయింట్లు కేటాయించారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై క్రీడా శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆస్టేల్రియా గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొని భారత కీర్తిపతాకను ఎగురవేసిన 18 మంది క్రీడాకారులను సీఎం కేసీఆర్‌ సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ల కల్పిస్తామని సీఎం హావిూ ఇచ్చారు. క్రీడాకారులకు తమ ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయం విదితమే. ఈ మేరకు వెంటనే ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. దీంతో రాష్ట్రంలో క్రీడలపై ఆసక్తి పెరగనుందని అంటున్నారు.