గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందాలి

* సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్

జూలూరుపాడు, ఆగష్టు 26, జనంసాక్షి:
జులురుపాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకునే మండపాల ఏర్పాటుకు ఆయా కమిటీలు కచ్చితంగా అనుమతులు పొందాలని జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని, ఉత్సవాలు నిర్వహించ దలచినవారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఉత్సవాలను భక్తితో, శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు కమిటీలు శ్రద్ధ చూపాలని కోరారు. కమిటీ ఏర్పాటు అనంతరం ఆయా గ్రామ పంచాయతీల ద్వారా అనుమతి తీసుకోవాలని, మండపం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించిన యజమాని అనుమతి కూడా తప్పనిసరిగా పొందాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ నుంచి, సౌండ్ మరియు మైకుల ఏర్పాటు కోసం పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు. మండపాల వద్ద డిజె సౌండ్ సిస్టం, బూర, గొట్టం మైకులకు అనుమతి లేదని, కేవలం రెండు సౌండ్ బాక్సులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. రాత్రి 10 గంటల తర్వాత గణేష్ మండపాల దగ్గర మైకులు, సౌండ్ బాక్సులు మరియు వివిధ రకాల సౌండ్లు పెట్టకూడదని తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో “గణేష్ మండపాల” ఏర్పాటు కోసం ముందుస్తుగా పోలీస్ శాఖకు తగు సమాచారం అందించి, అనుమతులు పొందిన తరువాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఆన్లైన్ అప్లికేషన్, మీసేవ లేదా ఈ సేవ రసీదు, విద్యుత్ శాఖ పర్మిషన్ లెటర్, స్థల యజమాని అనుమతి పత్రం, గ్రామ పంచాయితీ పర్మిషన్ పత్రాలను పోలీస్ స్టేషన్లో అందజేసి అనుమతి తీసుకొని కమిటీ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇంతే కాక గణేష్ మండపం వద్ద ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటర్ డ్రమ్ములు, ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గణేష్ విగ్రహం వద్ద రాత్రి సమయంలో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంది. మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడంతో పాటు గణేష్ విగ్రహం యొక్క ఎత్తు మరియు మండపం యొక్క పరిధిని తెలపాలని కోరారు. నిమజ్జనం తేది, నిమజ్జనం చేయు స్థలం వివరాలను కూడా ఇవ్వాలని సూచించారు. అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.