సికింద్రాబాద్ : మారిన వాతావరణ పరిస్థితులు స్వైన్‌ఫ్లూ వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఎండలు ముదిరితే స్వైన్‌ఫ్లూ ప్రభావం తగ్గిపోతుందనే వైద్యుల అంచనాలను తలకిందులుచేస్తూ హెచ్1ఎన్1 వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గత రెండు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎనిమిదేళ్ల బాలుడు సహా నలుగురు బాధితులు స్వైన్‌ఫ్లూ కారణంగా మృతి చెందారు. మృతుల వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని మెహదీపట్నంకు చెందిన కమలమ్మ(70) అనే వృద్ధురాలు స్వైన్‌ఫ్లూతో ఈనెల 15న ప్రీమియర్ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రికి రాగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాగా హైదరాబాద్ కార్వాన్కు చెందిన మహ్మద్ మెహమూద్(55) అనే వ్యక్తి గాంధీలో స్వైన్‌ఫ్లూకు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.
ఇక నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన అల్తాఫ్(08) అనే చిన్నారి, హైదరాబాద్ చింతల్‌కు చెందిన నాగలక్ష్మి (50) అనే మహిళ గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 63కు పెరిగింది. గాంధీ ఐసోలేషన్ వార్డులో ఇంకా 39 మంది పెద్దవారు, చిన్నారుల వార్డులో 13 మంది స్వైన్‌ఫ్లూ బాధితులు, మరో 26 మంది అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ నోడల్ అధికారి కె.నర్సింహులు తెలిపారు.




