Tuesday, 3 November 2026

గొప్పవారి జీవితాలతో స్ఫూర్తి

హైదరాబాద్‌,మే3(జ‌నం సాక్షి):  నిశ్చితి, అనిశ్చితి- ఈ రెండింటి మధ్య, మనిషి జీవితం ఒత్తిళ్లకు లోనవుతుంటుంది. భద్రత-అభద్రత, వ్యవస్థ-అవ్యవస్థల మధ్య ఊగిసలాడుతుంటుంది. సృష్టిలో ప్రతి చోటా
ఒక క్రమం కనిపిస్తుంది. మనిషి అది తెలుసుకుని వ్యవహరించగలగాలి. స్పష్టత, ధైర్యం, భద్రత, నమ్మకం… వీటిని అతడు సహజంగా ఇష్టపడతాడు. ఈ క్రమం వెనక గందరగోళం నెలకొంటే, మానవుడు అభద్రతా భావానికి గురవుతాడు.తెలియని శక్తి మనిషిలో నిక్షిప్తమై ఉంటుంది. అనంతమైన అవకాశాలు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి. తెగింపు లేకపోతే అవకాశం ఎంత గొప్పదో తెలుసుకోవడం అతడికి సాధ్యపడదు. ప్రపంచంలో సాహసించనివారు ఎంతగానో నష్టపోయారు. వివేకంతో తెగించినవారు విజయాలు సాధించారు. జీవితమంటేనే అభద్రతతో కూడుకున్నది. అది చీకటి వెలుగుల సమ్మిళితం. ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు…అన్నీ తప్పవు.న్యూటన్‌, ఐన్‌స్టీన్‌ చదువులో వెనకబడి ఉండేవారు. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దివ్యాంగుల తరగతిలో నేర్చుకున్నాడు. థామస్‌ ఎడిసన్‌ చదువు విషయంలో చిన్నప్పుడు బడిలో చీవాట్లు తిన్న వ్యక్తే. జోర్డన్‌ పాఠశాలలో ఉన్నప్పుడు బాస్కెట్‌బాల్‌ జట్టు నుంచి అతణ్ని తొలగించారు. విన్‌స్టన్‌ చర్చిల్‌ ఆరో తరగతిలో పరీక్ష తప్పాడు.గొప్పవారి జీవితాలు చదివినప్పుడు మనిషిలో ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. జీవితానికి ఒక ధ్యేయం అవసరమనే సందేశం అందుతుంది.సాధారణమైన వ్యక్తికి, అసాధారణమనిపించుకున్నవారికి ఒకటే తేడా- జిజ్ఞాసతో ముందుకు వెళ్ళడం!కలలు కంటూ, వాటిని నిజం చేయాలని తహతహలాడుతూ ప్రయత్నాలు సాగించేవారికి- ఊహించని విధంగా విజయం లభిస్తుంది!