Tuesday, 3 November 2026

గొర్రెలకాపరి దారుణహత్య

మక్తల్ రూరల్ : ఓ గొర్రెలకాపరి దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం అతని మృతదేహాన్ని దుండుగులు భీమా కాల్వలో పడేసిపోయారు. గ్రామస్తుల కథనం ప్రకారం… మక్తల్ మండలం కర్నికి చెందిన దండు రంగప్ప (38) వృత్తిరీత్యా గొర్రెలకాపరి. ఈయనకు భార్య సుమిత్రతో పాటు కుమారులు నరేష్, శివలింగప్ప, కూతురు శిరీష ఉన్నారు. ఎప్పటిలాగే గురువారం రాత్రి సుమారు తొమ్మిది గంటలకు ఇంటి నుంచి బైక్‌పై శివారులోని గొర్రెల మంద దగ్గరకు వెళ్లాడు.

అక్కడ అదే గ్రామానికి చెందిన నామల రమేష్, కప్పల నర్సిములు, మారెమోళ్ల ఆశప్ప, దండు పాండుతో కలిసి కలిసి నిద్రకు ఉపక్రమించాడు. శుక్రవారం ఉదయం సుమారు 11 గంటలకు వ్యవసాయ పనులకోసం కూలీలు అటువైపు వెళ్లగా భీమా కాల్వలో అతని మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

కొద్దిసేపటికి అతని తండ్రి సాబెన్న అక్కడికి టిఫిన్ తీసుకురాగా విషయం తెలుసుకుని బోరుమన్నాడు. సంఘటన స్థలాన్ని నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ మురళీగౌడ్ పరిశీలించి జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని రప్పించారు. అక్కడి ఆనవాళ్లను బట్టి దండు రంగప్పను దుండగులు దారుణంగా హత్య చేసి ఈడ్చుకుంటూ కాల్వలో బైక్ వద్ద పడేసినట్టు భావిస్తున్నారు.

గొర్రెల దగ్గర కాపలా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా రంగప్పకు గ్రామంలో 20రోజుల క్రితం కొందరితో ఘర్షణ పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. దీంతో కుల పంచాయితీ పెట్టించారన్నారు. ఈ హత్యకు సూత్రధారులెవరు? పక్కన ఉన్నవారే చేశారా? అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు జరుపున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *