Thursday, 5 November 2026

గ్రామపంచాయితీల్లో రైతు భవనాలు

పరిశోధనలకు అనుగుణంగా ఏర్పాట్లు: జోగు
ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి): ప్రతి గ్రామ పంచాయతీలో  రైతు భవనాలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ కేంద్రాల్లో భూ పరీక్షలు చేసి, ఏ పంటలు సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు వెచ్చించి కేంద్రాలను నిర్మించబోతున్నట్లు చెప్పారు.  ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తరతరాలుగా భూములు సాగుచేసే వారికి కూడా రైతుబంధు పథకం వర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఇకపోతే రాష్ట్రంలోని రైతులందరికీ జూన్‌ 2వ తేదీ నుంచి రూ.5 లక్షల బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి రైతుకు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. రైతు సుఖంగా ఉంటే బంగారు తెలంగాణ నిర్మాణమైనట్లేనని అన్నారు. పాస్‌ పుస్తకాలు, చెక్కులు రాని రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి చెక్కులు వస్తాయని చెప్పారు. గ్రామంలో ఏఈవోల సహకారంతో భూసార పరీక్షలు నిర్వహించి పంటలు పండించుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు చేసి రైతును రాజు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పథకంలో అటవీ హక్కులు పొందిన 6 వేల 847 మంది రైతులు 69 వేల 659 ఎకరాల భూమి సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులకు రూ.27 కోట్ల రైతుబంధు చెక్కులు అందిస్తున్నామన్నారు. 1500 ఎకరాల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూముల కోసం నీటి నిలువ చేసే పనులు చేపడుతోందన్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు బోరు బావులు మంజూరు చేస్తామన్నారు.