Thursday, 5 November 2026

గ్రామాల్లో పంచాయితీల రాజకీయ వేడి

ఊపందుకున్న స్థానిక ఎన్నికల చర్చ

రిజర్వేషన్లు తేలితే అభ్యర్థులు రెడీ

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): పంచాయతీ ఎన్నికలు జూలైలో జరిగే అవకాశాలు ఖరారు కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి సంతరించుకుంది. బిసి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి సర్వే జరుగుతోంది. దీంతో గ్రామాల్లో అప్పుడే స్థానిక ఎన్నికల వేడి కనిపిస్తోంది. అయితే రిజర్వేషన్లు ఖరారు అయితేనే ఎవరు రంగంలో ఉంటారన్నది తేలనుంది. అయినా కులాల వారీగా బేరీజు వేస్తున్నారు.అంతేగాకుండా నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆయా పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించిన నాయకులు బలబలాలు ప్రదర్శించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడమే ఆలస్యం నాయకులు రంగంలోకి దూకేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన సదస్సులో జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశముందని చేసిన ప్రకటన పల్లెల్లో రాజకీయాన్ని వేడెక్కించింది. వచ్చే జూలై నాటికి పంచాయతీ పాలన గడువు ముగుస్తుండటం, సకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారానికి సీఎం వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చినట్లయింది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉత్సాహం ప్రదర్శిస్తూ గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నారు. గడువులోగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామనే ఊహాగానాలతో పల్లె రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఎన్నికల తీరుతెన్నులపై గ్రామాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికల నిబంధనల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్న నేపథ్యంలో రసవత్తరంగా రాజకీయాలు నడుస్తున్నాయి. 500 జనాభా కలిగిన తండాలను సైతం పంచాయతీలుగా చేస్తూ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సారి ఎన్నికలు నిర్వహించే పంచాయతీల సంఖ్య కూడా పెరగనుంది. ఈ మేరకు ఏడాదిన్నర కిందటే రాష్ట్రంలోని తండాల జాబితాను సిద్ధం చేయించారు. అంతేగాకుండా ఆయా జిల్లాల నుంచి పంచాయతీలుగా మారడంతో తండాల జాబితాను సైతం రెడీ చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే తండాలు పంచాయతీలు అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి పంచాయతీ పాలన గడువు ముగుస్తోంది. ఈలోపే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది.