Thursday, 5 November 2026

రైతన్నన్నను కుంగదీస్తున్న వర్షాభావం

తొలకరి వర్షాలతో విత్తుకున్న రైతుల్లో ఆందోళన

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఇంకా ఎండాకాలం కొనసాగుతున్నట్లుగా ఉంది. వర్షాలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తొలకరితోనే విత్తనాలు విత్తినరైతుల్లో ఆందోళన తీవ్రం అవుతోంది. గత వారం రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో సాగు భూములకు నీరు లేక నెర్రులు బారుతున్నాయి. తొలకరి వర్షాలతో విత్తనాలు మొలకెత్తి ఎదుగుదలలో వర్షాలు లేకపోవడం వల్ల మొలిచిన మొక్కలు ఒక పక్క ఎండుతుండగా, మరో పక్క సాగు భూములు నెర్రులు పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.కనీసం ఒక్క చినుకైనా కురియకపోతే విత్తిన విత్తులు మురిగిపోవడం ఖాయంగా కనినిస్తోంది. మృగశిర కార్తె ప్రారంభంలోనే పలుప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురియడంతో విత్తనాలు వేశారు. ఓ వైపు వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నా వినలేదు.దుక్కులు దున్ని చాలా మంది రైతులు విత్తనాలు నాటుకునేందుకు సమాయత్తం అవుతున్నా తరుణంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆందోళనతో చూస్తున్నారు. ఇక మొలచిన మొక్కలను బతికించుకొనేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వర్షాదారంపైనే ఆధారపడిన రైతులు అష్టకష్టాలు పడుతన్నారు.తొలకరి వర్షాలకు వేసుకున్న విత్తనాలు మొలకెత్తి రైతుల్లో ఆశలు రేకిత్తిస్తుండగా, వర్షాలు ముఖం చాటేయడంతో మొలిచిన మొక్కలు ఎండ దాటికి కమిలిపోతున్నాయి. ఎండిపోతున్న మొక్కలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే అన్నదాతలకు కష్టాలు వెంటాడుతుండటంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలాచోట్ల ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట అయిన పత్తి పంటనే సాగు చేస్తారు. వర్షాకాలం ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఖరీఫ్‌కు సిద్ధమయ్యారు.