Tuesday, 3 November 2026

గ్రేటర్‌ ఎన్నికలపై తొడకొడుతున్న బిజెపి

అధికార పార్టీకి నిద్రలేకుండా చేస్తున్న నాయకులు

కెసిఆర్‌ వ్యూహంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): దుబ్బాక విజయంతో బిజెపి గ్రేటర్‌ ఎన్నికలకు తొడకొట్టింది. హైదరాబాద్‌లోనూ పాగా వేస్తామని ప్రకటించింది. దీనికితోడు అధికార పార్టీ కూడా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా రివ్యూలతో నిద్దుర లేకుండా గడుపుతోంది. ఓ వైపు సిఎం కెసిఆర్‌ మరోవైపు కెటిఆర్‌లు నగర ఎన్నికలతో పాటు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యూహాలు పన్నుతు న్నారు. అయితే ఇటీవలి వరదలు, సాయం, సమాయక చర్యల్లో వైఫల్యం వంటి కారణాలు బిజెపికి కలసి వచ్చే అవకాశం ఉంది. బిజెపి కూడా హైదరాబాద్‌ ఎన్నికలపై వ్యూహాత్మక అడుగులు వేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలుచేస్తోంది. వరదల కోసం కేంద్రం ఇచ్చిన సాయాన్ని పంచలేదని విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీలో మాత్రం మార్పు కానరావడం లేదు. వరద ప్రాంతాల ప్రజలను పలకరించి వారికి సాయం అందచేద్దామన్న చిత్తశుద్ది కానరావడం లేదు. మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో మితివిూరిన స్నేహం కూడా తెలంగాణలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉంది. ఓ రకంగా టిఆర్‌ఎస్‌ విధాలను బిజెపికి అనుకూలంగా హిందువలను సంఘటితం చేయబోతున్నదని గుర్తించాలి.దుబ్బాక ఎన్నికల ఫలితంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతున్నదన్న సంకేతం కనిపిస్తోంది. ఇంతకాలం తిరుగలేని నేతగా,రాజకీయంగా లాభపడుతూ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల విషయంలో మాత్రం కొంత తడబడుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. నవంబరు చివర్లో లేదా డిసెంబరు మొదటి పక్షంలో గ్రేటర్‌ ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు ఇచ్చిన మంత్రి కేటీఆర్‌ కూడా దుబ్బాక ఫలితంతో కొంత ఊగిసలాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. నెల రోజుల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడం, బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల వంతున ఆర్థిక సహాయం చేయడంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా గ్రేటర్‌ ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు జరిగేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ హడావిడి కూడా దీనిని సూచిస్తోంది.వరద బాధితులకు ప్రభుత్వ ఖజానా నుంచి 550 కోట్ల రూపాయలను పంచిపెట్టడం ద్వారా గ్రేటర్‌ ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టాలనుకున్న టిఆర్‌ఎస్‌ ప్రయత్నం సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇతర నాయకుల చేతివాటం పుణ్యమా అని బెడిసికొట్టింది. ప్రభుత్వ అధికారుల ద్వారా అందించాల్సిన సహాయాన్ని పార్టీ నాయకుల ద్వారా లెక్కాపక్కా లేకుండా పంచిపెట్టాలనుకోవడంతో ప్రజల్లో అది అందక తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తనకు తెలంగాణలో ఎదురులేదు అని కేసీఆర్‌ అనుకుంటున్న సమయంలోనే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరగడం, అక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ గెలవడం ఒకింత షాక్‌కు గురిచేసింది. బిజెపి నుంచి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో బీజేపీ నాయకులు అధికార టీఆర్‌ఎస్‌కు చెమటలు పట్టించారు. గ్రేటర్‌లోనూ మట్టి కరిపిస్తామని కమలనాధులు శపథాల విూద శపథాలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో తృతీయ స్థానానికే పరిమితమైన బీజేపీ ఈ ఉపఎన్నిక ఫలితంతో అధికార పార్టీకి సవాల్‌గా మారడంతో ప్రజలకు కూడా ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. ఇకపోతే ఇటీవల హైదరాబాద్‌లో శాంతిభద్రతల కు విఘాతం కలిగించే కుట్రకు బీజేపీ నాయకులు పాల్పడబోతున్నారని మంత్రి కెటిఆర్‌ చేసిన ఆరోపణ కూడా బెడిసి కొట్టింది. ఇది కూడా బిజెపిక ఇకలసి వచ్చింది. ఎన్నికల కోడ్‌ అమలులో లేని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేటీఆర్‌ ఆరోపించినట్లుగా హైదరాబాద్‌లో ఏం జరగ లేదు. కారణాలు ఏమైనప్పటికీ, అధికార పార్టీ పట్ల యువతలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కేటీఆర్‌ చుట్టూ ఉంటున్న వారు కూడా వివాదాస్పద భూములను కొల్లగొడుతున్నారని విమర్శలు వస్తున్నా యి. పాలనాయంత్రాంగం గతంలో ఉరుకులు, పరుగులు పెట్టేది. ఇప్పుడు స్తబ్దుగా మారింది. సమస్యలపై ఆరోపణలను లైట్‌గా తీసుకుంటున్నారన్న విమర్శలు పెరిగాయి. ఈ తరుణంలో అందివచ్చిన అవకాశం కోసం బిజెపి ఎదురు చూస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో వ్యూహరచన చేసుకుంటున్నారు. బస్తీలలో కూడా బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇదే సమయంలో ఇపుడు తెలంగాణలో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా సవిూకృతం అవుతున్నారు. బీజేపీ రూపంలో ఎదురుకాబోతున్న ముప్పును కెసిఆర్‌ రేపటి గ్రేటర్‌ ఎన్నికల్లో ఎలా ఎదుర్కొంటాన్నదే ప్రశ్న.