ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని ,ఆయన చేపట్టిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు.యువతకి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం , పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు.రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాక దేశ చరిత్రలో కొత్త రికార్డులు నెలకొల్పారని కొనియాడారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.